జీవితపు ప్రతి మలుపూ...ఓ గెలుపు పిలుపు | Calls for a win every malupu life ... | Sakshi
Sakshi News home page

జీవితపు ప్రతి మలుపూ...ఓ గెలుపు పిలుపు

Published Sun, Mar 23 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

Calls for a win every malupu life ...

అభాగినుల పాలిట అమ్మ


జీవితంలో సుఖదుఃఖాలు సహజం. కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా ఎదిరించి, ముందుకు పోవడమే మనిషి చేయాల్సింది. అలా చేసినప్పుడే విజేతలుగా నిలుస్తాం. జీవితాన్ని గెలుస్తాం. కానీ, గెలుపంటే... కేవలం మనం గెలవడమే కాదు... మన తోటివారినీ గెలిపించడం! పడిపోతున్న సాటి మనిషికి చేయిచ్చి, నిలబెట్టడం! మన జీవనం మరెందరికో ప్రేరణ కలిగించడం! వ్యక్తిగత విషాదాన్ని కూడా వ్యవస్థకు స్ఫూర్తినిచ్చే మార్గానికి మళ్ళించుకున్నవాళ్ళే అసలైన విజేతలు... సమాజానికి స్ఫూర్తిదాతలు.

అత్యాచార బాధితులకు అమ్మగా మారిన అనూరాధ, జీవిత విషాదాన్ని కడుపులో దాచుకొని తొమ్మిది పదులు దాటినా పరుగు ఆపని ఫౌజా సింగ్, క్యాన్సర్‌ను ఓడించి పర్వతారోహణతో తోటివారిని గెలిపిస్తున్న షాన్... వీరంతా మన మధ్యనే ఉన్న మామూలు మనుషులే అయినా జీవిత పోరాటంలోని ప్రతి మలుపునూ గెలుపు పిలుపుగా మార్చుకున్న ఆదర్శవంతులు. జీవితాన్ని గెలిచిన వీరి ప్రస్థానం అవిస్మరణీయ స్ఫూర్తి మంత్రం.
 
నేపాల్ రాజధాని ఖాట్మండు. పోలీసు వ్యాన్ వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. లోపల ఏదో పనిలో ఉన్న అనూరాధా కొయిరాలా లేచి బయటికొచ్చింది. వ్యాన్‌లో నుంచి పోలీసులతో పాటు ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి కూడా దిగింది. ఆమె ముఖం వాడిపోయి ఉంది. కళ్లు నీటి చలమల్లా ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు గీత. తండ్రి లేడు. అంధురాలైన తల్లికి ఆసరాగా ఉండటం కోసం, తమ ఇద్దరి కడుపులూ నిండడం కోసం కూలీ పని చేసేది.

ఓ రోజు ఓ బంధువు గీతకు మంచి పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వేశ్యా గృహంలో అమ్మేశాడు. అప్పటికామె వయసు తొమ్మిదేళ్లు. ఆడుతూపాడుతూ గడవాల్సిన గీత బాల్యం... విటుల వికృత చేష్టలతో విషాదభరితమైంది. మూడేళ్లు నరకం చూసింది. ఓ రోజు పోలీసులు వేశ్యా గృహంపై దాడి చేసి, సోదాలు నిర్వహించినప్పుడు ఆమె దొరికింది. వాళ్లు ఆమెను అనూరాధ దగ్గరకు తీసుకెళ్లారు.
 
గీతను లోపలకు తీసుకెళ్లింది అనూరాధ. అంతే... అంతవరకూ గుంభనంగా ఉన్న గీత వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది అనూరాధ. ‘నేనున్నాను’ అని భరోసా ఇస్తున్నట్టుగా వెన్ను నిమిరింది. ఆ ఆప్యాయతకు చలించిపోయింది గీత. అనూరాధలో అమ్మను చూసుకుంది. కానీ ఆమెకు తెలియదు... అప్పటికే తన లాంటి చాలామంది కూతుళ్లు అనూరాధకు ఉన్నారని!
 
అది అభాగ్యులకు పుట్టిల్లు...
 
మనిషికి కూడు, గూడు, గుడ్డ ముఖ్యావసరాలని అంటారు. కానీ ఆడపిల్లకు వీటితో పాటు మరో ముఖ్యావసరం ఉంది... ‘రక్షణ’. అమ్మాయిలకు ప్రమాదం ఎప్పుడూ పురుషుడి రూపంలో పొంచే ఉంటుంది అంటుంది అనూరాధ. భర్త, బంధువు, పక్కింటివాడు, వీధి చివర ఉండే పోకిరిగాడు, బడిలో పాఠాలు చెప్పే మాస్టారు, సహ విద్యార్థి, కిరాణా కొట్టువాడు, పాలవాడు... ఎవరి వల్ల ఎప్పుడు తమ మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందోనని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి. ఇది అనూరాధకు నచ్చలేదు. అందుకే ఆడపిల్లల రక్షణే లక్ష్యంగా ఇరవయ్యేళ్లుగా తన జీవన ప్రస్థానాన్ని సాగిస్తోంది.

1993లో మైతీ నేపాల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది అనూరాధ. మైతీ అంటే పుట్టిల్లు అని అర్థం. కష్టం వస్తే ఆడపిల్లలు పుట్టింటికెళ్లి తల దాచుకుంటారు. అందుకే తన ఇంటిని పుట్టింటిని చేసిందామె. అమ్మలా కొండంత అండ అయింది. నాన్నలా ధైర్యాన్నిచ్చింది. అన్నలా కాపాడింది. దీనంతటి వెనుక... కదిలించే కథ ఉంది.
 
అనూరాధ తల్లితండ్రులైన ప్రతాప్‌సింగ్, లక్ష్మి దంపతులు ఎదుటివారికి తోడ్పడటంలో ముందుండేవారు. వారి మంచితనాన్ని పుణికి పుచ్చుకుంది అనూరాధ. ఎవరు కష్టంలో ఉన్నా పరిగెత్తుకు వెళ్లేది. కానీ తన జీవితమే కష్టాలపాలవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. దినేష్ ప్రసాద్ కొయిరాలాతో పెళ్లి ఆమె జీవితాన్నే మార్చేసింది. భర్త క్రూరుడు. అష్టకష్టాలు పెట్టాడు. అనుమానించాడు. అవమానించాడు. ఎన్నో యేళ్లపాటు సహించింది. చివరికి ఓపిక నశించింది. హింసించడం ఎంత తప్పో, హింసకు తలవంచ డం కూడా అంతే తప్పన్న నిజాన్ని గ్రహించి, భర్త నుంచి విడిపోయింది.
 
నాటితో హింస నుండి విముక్తి లభించింది. కానీ ఎందుకో మనశ్శాంతి లేదు. తానంటే చదువుకుంది. ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తోంది. ధైర్యంతో హింసను ఎదిరించింది. కానీ ఆ అవకాశం లేనివాళ్లంతా మౌనంగా భరిస్తున్నారు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ‘మైతీ నేపాల్’ను స్థాపించింది. ఎక్కడ ఏ ఆడపిల్ల కష్టంలో ఉందని తెలిసినా అక్కడికి వెళ్లిపోతుంది. కాపాడి తీసుకొస్తుంది. గృహహింసకు గురవుతున్నవారినీ, అత్యాచార బాధితులనూ ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది. ఆసక్తి ఉంటే చదివిస్తుంది. లేదంటే చేతివృత్తులు నేర్పించి తమ కాళ్లమీద తాము నిలబడేలా చేస్తుంది. అలా ఇప్పటికి కొన్నివేల మంది జీవితాలను తీర్చిదిద్దింది.
 
ఇప్పటికీ ఆమె గూటికి వందల మంది నిస్సహాయ వనితలు వస్తూనే ఉన్నారు. వాళ్లు ఎవరైనా ఆమె పిల్లలే. ఆమె ప్రేమకు అర్హులే. అందుకే వాళ్లంతా అనూరాధను అమ్మ అంటారు. ఆమె గుండెల్లో తల దాచుకుంటారు. ఆమె చూపే బాటలో సాగి బతుకులు బాగు చేసుకుంటారు. వాళ్లందరినీ చూస్తే ఒకటే అనిపిస్తుంది. అనూరాధ ఉన్నంతవరకూ ఏ ఆడపిల్లా ఒంటరిది కాదు. నిస్సహాయురాలూ కాదు, ఆమె కానివ్వదు!     
     
- సమీర నేలపూడి
 
సేవానిరతికి గాను దాదాపు ముప్ఫై జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అనూరాధను వరించాయి. హాలీవుడ్ నటి డెమీ మూర్ అనూరాధ సేవకు ముగ్ధురాలై, ఆమెతో చేతులు కలిపింది. ‘మైతీ నేపాల్’కు తన వంతు సహాయాన్ని అందిస్తోంది. పలు దేశాల్లోని ప్రముఖ సంస్థలు విరాళాలివ్వడానికి ముందుకొచ్చాయి. అనూరాధ వల్ల నేపాల్‌లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు చాలావరకూ తగ్గిపోయాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించడం ఆమె సాధించిన గొప్ప విజయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement