Sanitation tenders
-
పాంచ్ పటాక !
కరీంనగర్ నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో రాజకీయ కంపుకొడుతోంది. అవినీతిని ప్రశ్నించాల్సిన కొందరు కార్పొరేటర్లు ఓ గ్రూపుగా ఏర్పడి టెండర్లు దక్కించుకుంటూ బల్దియా సొమ్మును దండుకుంటున్నారు. పాలకవర్గం ఉన్నా... లేకున్నా కార్పొరేషన్లో వీరిదే పెత్తనం. కార్పొరేషన్‌గా ఆవిర్భవించినప్పటినుంచి ఇప్పటివరకు తొమ్మిదేళ్లలో మూడేసార్లు టెండర్లు జరగగా... ఐదు ఏజెన్సీల కాంట్రాక్టర్లే ఎప్పుడూ టెండర్ దక్కించుకుంటున్నారు. పలువురు అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ఈ కాంట్రాక్టులో భాగస్వామ్యం ఉండడంతో వారు ఆడిందే ఆటగా తయారైంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్ 2005లో ఆవిర్భవించింది. పాలకవర్గం ఏర్పడిన తొలి ఏడాది శానిటేషన్ టెండర్లు నిర్వహించగా ఐదు ఏజెన్సీలు జట్టుకట్టి దక్కించుకున్నాయి. వీటిలో నాలుగు ఏజెన్సీలు అధికార, ప్రతిపక్షానికి చెం దిన కొందరు కార్పొరేటర్ల బంధువులవే కావ డం గమనార్హం. 2006లోనూ టెండర్లు నిర్వహించగా ఇదే గ్రూపు వాటిని చేజిక్కుంచుకుంది. 2007 నుంచి 2012 వరకు దాదాపు ఐదేళ్లు మాత్రం టెండర్లు నిర్వహించకుండా గడువు పొడిగింపు పేరుతో సదరు గ్రూపునకే కాంట్రా క్టు కట్టబెట్టారు. అధికార, ప్రతిపక్షాల భాగస్వామ్యం ఉండడంతో పెద్దగా ప్రతిబంధకాలేమీ లేకుండానే పొడిగింపు ప్రక్రియకు పాలకమండలిలో ఆమోదముద్ర పడింది. పొడిగిం పులు జరిగిన ప్రతీసారి లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలు మార్చి... 2013లో కార్పొరేషన్లో ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. అప్పుడు టెండర్లు నిర్వహించిన అధికారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను తొలి సారి ప్రవేశపెట్టారు. ఏ ఒక్క కాంట్రాక్ట్ సంస్థ కూడా సదరు నిబంధనల ప్రకారం టెండర్లు వేసేందుకు అర్హత సాధించలేకపోయింది. దీంతో సదురు గ్రూపు మళ్లీ చక్రం తిప్పి నిబంధనలను మార్చి టెండర్లు దక్కించుకుంది. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర మంత్రి స్థాయిలో పైరవీ చేయించుకున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ఏడాది జూలై 31తో టెండర్ల కాలపరిమితి ముగియగా... అదే నెల చివరివారంలో ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించారు. నెల చివరన టెండర్లు నిర్వహించడంతో కార్మికుల వేతనాలు చెల్లించాలంటే తప్పనిసరిగా పొడిగింపు ఇవ్వాల్సిందేనని భావించిన అధికారులు మళ్లీ పాత కాంట్రాక్టర్లకే మూడు నెలల పొడిగింపు ఇచ్చా రు. సదరు గ్రూపుతో జతకట్టిన అధికారులు ఉద్ధేశపూర్వకంగానే పొడిగింపు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నెలలో మళ్లీ టెండర్లకు సిద్ధమవగా, టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరగడం, వీటిపై పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వాటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మరోసారి పాత కాంట్రాక్ట్ ఏజెన్సీకే పొడిగింపు ఇవ్వక తప్పని పరిస్థితి తలెత్తింది. ఇలా పాతవారే జాక్‌పాట్ కొడుతూ... రాజకీయ నాయకుల అండదండలతో టెండర్లు తమ చేజారకుండా గుప్పిట పెట్టుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల గైర్హాజరే... కాంట్రాక్టర్‌కు ఆదాయ వనరు పారిశుధ్య పనుల్లో కార్మికుల గైర్హాజరే కాంట్రాక్టర్లకు లాభాల పంట పండిస్తోంది. నగరపాలక సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 681 మంది కాంట్రాక్టు కార్మికులు పారిశుధ్య పనులు చేస్తున్నారు. గ్రూపు కార్మికుల పేరిట మరో 66 మంది ఈ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వీరిలో ప్రతిరోజు సగటున 100 మంది గైర్హాజరవుతున్నారు. హాజరు పట్టికలో మాత్రం కార్మికులంతా ప్రతిరోజూ విధులు నిర్వహిస్తున్నట్లు చూపుతున్నారు. అదే సమయంలో గైర్హాజరయ్యే కార్మికులకు వేతనాల్లో కోత విధిస్తూ ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు తమ జేబులో నింపుకుంటున్నారు. వాస్తవానికి ప్రైవేటు కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.8,300 వేతనం ఉంటుంది. సగటున ప్రతీ కార్మికుడు ఐదు రోజులపాటు విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కో కార్మికుని నెల వేతనం నుంచి రూ.వెయ్యి కోత విధిస్తున్నారు. ఈ లెక్కన విధులకు గైర్హాజరయ్యే కార్మికుల వేతనాల నుంచి ప్రతినెలా నెల సగటున రూ.13 లక్షల మేర నిధులు సదరు కాంట్రాక్టు గ్రూపు తమ జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఏడాదికి రూ.1.5 కోట్లు ఉంటోందని ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఇంతవరకు చర్యలు లేకపోవడం గమనార్హం. -
బిగుస్తున్న ఉచ్చు
టవర్‌సర్కిల్: కరీంనగర్ కార్పొరేషన్లో శానిటేషన్ టెండర్లలో గోల్‌మాల్‌పై ‘‘ఐఏ‘ఎస్’ అంటే నిబంధనలు తూచ్’’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనం బల్దియాను కుదిపేస్తోంది. శ్రీరాజరాజేశ్వర సంస్థకు అర్హతలు లేకున్నా రూ.10 కోట్ల విలువైన పారిశుధ్య టెండర్లు కట్టబెట్టారని, కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు నిబంధనలు ఉల్లంఘించారనే విషయాన్ని వెల్లడిస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో అధికారుల్లో వణుకు మొదలైంది. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏకంగా హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు వెళ్లడం, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీరియస్ అయ్యి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా మేయర్ రవీందర్‌సింగ్ వ్యాఖ్యలు కూడా అక్రమాలు జరిగినట్లు తేల్చడం... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అక్రమాలతో సంబంధమున్న అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నగరపాలక సంస్థ అభాసుపాలు కాకుండా ఉండేందుకు పాలకవర్గం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించడంతో బాధ్యులుగా తేలిన వారికి సరెండర్ తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. మూడు రోజులుగా టెండర్ల వ్యవహారం రచ్చరచ్చ అవుతుండడంతో ఈ అంశం నుంచి బయటపడేందుకు అడ్డంగా ఇరు క్కున్న అధికారులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. టెండర్లను రద్దు చేస్తే సమస్య సమసి పోతుందని మొదట భావించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రాజీయత్నాలు దిగారు. ఈ వ్యవహారంతా గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేద్దామని ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడం, బయటపడేందుకు దారులన్నీ మూసుకుపోవడం తో అధికారులు పడరానిపాట్లు పడుతున్నట్లు తెలుస్తోం ది. టెండర్ల అంశం ఏకంగా కమిషన్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కి వెలుతుండడంతో చేసిన తప్పిదాలు బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది. డీఎంఏ, ఈఎన్సీ నుంచి కూడా వివరణ అడుగుతుం డడంతో తప్పించుకునే మార్గాలు అన్ని వైపులా మూసుకుపోయాయి. దీంతో బాధ్యులైన అధి కారులపై వేటు పడడం ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి. -
పారిశుద్ధ్యానికి ‘టెండర్’!
నరసన్నపేట, న్యూస్‌లైన్: సర్కారు ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను కేంద్రీకృతం చేసి రాష్ట్రస్థాయిలో ఒకే సంస్థ కు కట్టబెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు రూపొందించిన కొత్త విధానం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటి మాదిరిగా జిల్లా యూనిట్‌గానే ఖరారు చేయాలని పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను రాష్ట్రస్థాయిలో ఒక్కరికే అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు టెండర్లు కూడా ఆహ్వానించింది. ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ సెంటర్లు, జిల్లా, డివిజన్ స్థాయి ఆస్పత్రుల్లో ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థలు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నాయి. గతంలో ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండే వి. రోగులు, వారితోపాటు వచ్చే సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనితో పాటు పారిశుద్ధ్య పనివారి వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలు ఆర్థిక భారంతో కూడుకున్నవి కావడంతో ఈ మొత్తం బాధ్యతను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా సంస్థలను ఖరారు చేస్తున్నారు. దాంతో ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం కాస్త మెరుగుపడింది. ఈ విధానంలో అవకతవకలకు ఆస్కారం ఉందని గుర్తించి, పారిశుద్ధ్య సేవలకు ముందుకు వచ్చే సంస్థల గత చరిత్రను పరిశీలించిన తర్వాత రెన్యువల్ పద్ధతిలో ప్రతి ఏటా వారికే అప్పగిస్తున్నారు. అయితే ఇటీవల అధికారులు కొత్త విధానం రూపొందించారు. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకే సంస్థకు పారిశుద్ధ్య సేవల కాంట్రాక్టు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటన కూడా జారీ చేశారని తెలిసింది. ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒకే సంస్థకు అప్పగించడం వల్ల మొక్కుబడి సేవలే అందుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం ఏర్పడి ఆశించిన ఫలితం రాదని అంటున్నారు. అంతేకాక ప్రస్తుతం సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానికేతర సమస్య ఉత్పన్నం కావడంతోపాటు అవినీతి అక్రమాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందువల్ల ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పునరాలోచించి జిల్లాలవారీగా పారిశుద్ధ్య టెండర్లు నిర్వహించాలని కోరుతున్నారు.