పాంచ్ పటాక ! | Panch Pataca! | Sakshi
Sakshi News home page

పాంచ్ పటాక !

Published Sun, Nov 2 2014 3:49 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

పాంచ్ పటాక ! - Sakshi

పాంచ్ పటాక !

కరీంనగర్ నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో రాజకీయ కంపుకొడుతోంది. అవినీతిని ప్రశ్నించాల్సిన కొందరు కార్పొరేటర్లు ఓ గ్రూపుగా ఏర్పడి టెండర్లు దక్కించుకుంటూ బల్దియా సొమ్మును దండుకుంటున్నారు. పాలకవర్గం ఉన్నా... లేకున్నా కార్పొరేషన్‌లో వీరిదే పెత్తనం.

కార్పొరేషన్‌గా ఆవిర్భవించినప్పటినుంచి ఇప్పటివరకు తొమ్మిదేళ్లలో మూడేసార్లు టెండర్లు జరగగా... ఐదు ఏజెన్సీల కాంట్రాక్టర్లే ఎప్పుడూ టెండర్ దక్కించుకుంటున్నారు. పలువురు అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ఈ కాంట్రాక్టులో భాగస్వామ్యం ఉండడంతో వారు ఆడిందే ఆటగా తయారైంది.

 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
 కరీంనగర్ కార్పొరేషన్ 2005లో ఆవిర్భవించింది. పాలకవర్గం ఏర్పడిన తొలి ఏడాది శానిటేషన్ టెండర్లు నిర్వహించగా ఐదు ఏజెన్సీలు జట్టుకట్టి దక్కించుకున్నాయి. వీటిలో నాలుగు ఏజెన్సీలు అధికార, ప్రతిపక్షానికి చెం దిన కొందరు కార్పొరేటర్ల బంధువులవే కావ డం గమనార్హం. 2006లోనూ టెండర్లు నిర్వహించగా ఇదే గ్రూపు వాటిని చేజిక్కుంచుకుంది.

2007 నుంచి 2012 వరకు దాదాపు ఐదేళ్లు మాత్రం టెండర్లు నిర్వహించకుండా గడువు పొడిగింపు పేరుతో సదరు గ్రూపునకే కాంట్రా క్టు కట్టబెట్టారు. అధికార, ప్రతిపక్షాల భాగస్వామ్యం ఉండడంతో పెద్దగా ప్రతిబంధకాలేమీ లేకుండానే పొడిగింపు ప్రక్రియకు పాలకమండలిలో ఆమోదముద్ర పడింది. పొడిగిం పులు జరిగిన ప్రతీసారి లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.

 నిబంధనలు మార్చి...
 2013లో కార్పొరేషన్‌లో ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. అప్పుడు టెండర్లు నిర్వహించిన అధికారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను తొలి సారి ప్రవేశపెట్టారు. ఏ ఒక్క కాంట్రాక్ట్ సంస్థ కూడా సదరు నిబంధనల ప్రకారం టెండర్లు వేసేందుకు అర్హత సాధించలేకపోయింది. దీంతో సదురు గ్రూపు మళ్లీ చక్రం తిప్పి నిబంధనలను మార్చి టెండర్లు దక్కించుకుంది. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర మంత్రి స్థాయిలో పైరవీ చేయించుకున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

ఈ ఏడాది జూలై 31తో టెండర్ల కాలపరిమితి ముగియగా... అదే నెల చివరివారంలో ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించారు. నెల చివరన టెండర్లు నిర్వహించడంతో కార్మికుల వేతనాలు చెల్లించాలంటే తప్పనిసరిగా పొడిగింపు ఇవ్వాల్సిందేనని భావించిన అధికారులు మళ్లీ పాత కాంట్రాక్టర్లకే మూడు నెలల పొడిగింపు ఇచ్చా రు. సదరు గ్రూపుతో జతకట్టిన అధికారులు ఉద్ధేశపూర్వకంగానే పొడిగింపు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నెలలో మళ్లీ టెండర్లకు సిద్ధమవగా, టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరగడం, వీటిపై పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వాటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మరోసారి పాత కాంట్రాక్ట్ ఏజెన్సీకే పొడిగింపు ఇవ్వక తప్పని పరిస్థితి తలెత్తింది. ఇలా పాతవారే జాక్‌పాట్ కొడుతూ... రాజకీయ నాయకుల అండదండలతో టెండర్లు తమ చేజారకుండా గుప్పిట పెట్టుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 కార్మికుల గైర్హాజరే... కాంట్రాక్టర్‌కు ఆదాయ వనరు
 పారిశుధ్య పనుల్లో కార్మికుల గైర్హాజరే కాంట్రాక్టర్లకు లాభాల పంట పండిస్తోంది. నగరపాలక సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 681 మంది కాంట్రాక్టు కార్మికులు పారిశుధ్య పనులు చేస్తున్నారు. గ్రూపు కార్మికుల పేరిట మరో 66 మంది ఈ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వీరిలో ప్రతిరోజు సగటున 100 మంది గైర్హాజరవుతున్నారు. హాజరు పట్టికలో మాత్రం కార్మికులంతా ప్రతిరోజూ విధులు నిర్వహిస్తున్నట్లు చూపుతున్నారు. అదే సమయంలో గైర్హాజరయ్యే కార్మికులకు వేతనాల్లో కోత విధిస్తూ ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు తమ జేబులో నింపుకుంటున్నారు.

వాస్తవానికి ప్రైవేటు కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.8,300 వేతనం ఉంటుంది. సగటున ప్రతీ కార్మికుడు ఐదు రోజులపాటు విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కో కార్మికుని నెల వేతనం నుంచి రూ.వెయ్యి కోత విధిస్తున్నారు. ఈ లెక్కన విధులకు గైర్హాజరయ్యే కార్మికుల వేతనాల నుంచి ప్రతినెలా నెల సగటున రూ.13 లక్షల మేర నిధులు సదరు కాంట్రాక్టు గ్రూపు తమ జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఏడాదికి రూ.1.5 కోట్లు ఉంటోందని ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఇంతవరకు చర్యలు లేకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement