ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోయినా ఓ శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి కాకాణి శుక్రవారం మండలంలో పర్యటించారు. ముందు గా కాకాణి వరిగొండలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం పంచాయతీలో పలు గ్రామాల్లో పర్యటించి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లకు కాకాణి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సర్వేపల్లి ప్రజల రుణం తీర్చుకుంటానన్నా రు. గతంలో తాను చేపట్టిన గడపగడపకు దీవెనయాత్ర తన విజయానికి దోహదపడిం దన్నారు. ఆ యాత్ర ద్వారా తాను చూసిన ప్రజా సమస్యలను పరిష్కరిం చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. శాసనసభ్యుడికి అర్థం సేవ చేయడమేనని దానికి పర్యాయపదంగా నిలుస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులతో స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. స్థానికంగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు ప్రయత్నిస్తానన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోయినా సమర్థత కలిగిన ప్రతిపక్ష హోదా లో ప్రజా సమస్యలపై పోరాటం సాగి స్తుందన్నారు.
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చే వరకు పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉండి 2004, 2009లో అధికారం చేపట్టారని అదే ఆనవాయితీ జగన్మోహన్రెడ్డి విషయంలోనూ జరుగబోతుందన్నారు. ఈ ఐదేళ్లు నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా పార్టీ కోసం పనిచేయాలన్నారు. అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని కాకాణి స్పష్టం చేశారు.
పార్టీ మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, నాయకులు నెల్లిపూడి సునీల్‌కుమార్‌రెడ్డి, టంగుటూరు శ్రీనివాసులరెడ్డి, నెల్లిపూడి రాజగోపాలరెడ్డి, ఇసనాక రమేష్‌రెడ్డి, తిక్కవరపు సనత్‌రెడ్డి, కావలిరెడ్డి రవీంద్రరెడ్డి, కోడూరు దిలీప్‌రెడ్డి, కోడూరు వెంకురెడ్డి, మన్నెం చిరంజీవులగౌడ్, వేణుంబాకం సుమంత్‌రెడ్డి, వేనాటి జితేంద్రరెడ్డి, తూపిలి శ్రీధర్‌రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, నెల్లిపూడి శ్రీనివాసులరెడ్డి, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, తూపిలి నారాయణరెడ్డి, కోసూరు రవీంద్రయ్య, పంది రామసుబ్బయ్య, జానా శీనయ్య, జానా శేషు, ఉండ్రాళ్ల శ్రీనివాసులు, కటకం శ్రీనివాసులు పాల్గొన్నారు.