మనకోసం కాదు.. వాటి కోసం..
ఇది సీ ట్రీ డిజైన్. ఈ వినూత్న భవనాన్ని డిజైన్ చేసింది మనం ఉండటానికి కాదు.. వృక్ష, జంతు జీవజాలం ఉండటానికి! నగరాల్లోని పచ్చదనాన్ని కాంక్రీటు భవనాలు మింగేస్తున్న నేపథ్యంలో నీటిపై తేలియాడే ఈ సీ ట్రీ వంటివి వాటిని హరితమయం చేస్తాయని దీన్ని డిజైన్ చేసిన వాటర్ స్టూడియో సంస్థ(నెదర్లాండ్) చెబుతోంది. ఈ హరిత భవనం అరలు అరలుగా ఉంటుంది. ఇందులో రకరకాల చెట్లు, మొక్కలతోపాటు పక్షులు, గబ్బిలాలు, తుమ్మెదలు, తేనెటీగలు ఇంకా ఇతర చిన్న జంతువులు ఉండొచ్చట. ఇక నీటి కింది భాగంలో ఉండే అరలు అక్కడి జీవజాలానికి ఆవాసంగా ఉంటాయి. ఈ సీ ట్రీలను సముద్రాలు, నదులు, సరస్సులు దేనిపైనైనా నిర్మించొచ్చు.
నీటి అడుగున ఉండే కేబుల్ వ్యవస్థ ఆధారంగా ఇది అటూ ఇటూ కదలకుండా ఒకే చోట ఉండేలా చేస్తారు. సీ ట్రీ ప్రకృతి పరిరక్షణకు తోడ్పడుతుందని.. కాలుష్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఒక్కో సీ ట్రీ నిర్మాణానికి రూ.7.8 కోట్లు ఖర్చవుతుంది. వీటి నిర్మాణానికి అవసరమయ్యే నిధులను పెద్ద పెద్ద చమురు కంపెనీల నుంచి సేకరించవచ్చని వాటర్ స్టూడియో అంచనా వేస్తోంది. ఇంకో విషయం.. ఇందులో మనుషులకు ప్రవేశం నిషిద్ధం. అక్కడుండే జంతు జీవజాలాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదన్నమాట.