బాల్యమిత్రుడే దోచేశాడు..
♦ మేడిపల్లి భారీ దోపిడీ కేసును చేధించిన పోలీసులు
♦ ఐదుగురి అరెస్టు, 33లక్షల నగదు,
♦ 15తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో : డబ్బుల కక్కుర్తి పడి తన మిత్రుడి ఇంట్లోనే దోపిడీకి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడుతో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.33 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌లో కమిషనర్ మహేష్ భగవత్ శనివారం వివరాలు వెల్లడించారు. పెయింటర్‌గా పని చేస్తున్న బోడుప్పల్ వాసి ఈతకోట గోపాల కృష్ణ, మేడిపల్లి సరస్వతీనగర్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి బాల్య స్నేహితులు. చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి తరుచుగా వచ్చే గోపాలకృష్ణ అతనితో కలిసి మద్యం సేవించేవాడు. ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి పర్వతాపూర్‌లోని ఓ స్థలం విక్రయించగా రూ.30 లక్షలు వచ్చాయి.
ఈ విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ వాటని కాజేసేందుకు సమయం కోసం వేచి చూశాడు. ఈ నెల 5న చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వెళ్లడంతో ఇంట్లో అతని తల్లి బాలమణి ఒక్కతే ఉంటుందని తెలిసిన గోపాలకృష్ణ తన స్నేహితుడు రాగిరిబాబుతో కలిసి మద్యం తీసుకొని వారింటికి వెళ్లి ఆమె పీకలదాకా మందు తాగించారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు ముందస్తు పథకం ప్రకారం తమ స్నేహితులైన రాజేందర్, నవీన్‌కుమార్, మదుసూదన్ గౌడ్లను పిలిపించి ఇంట్లో నగదు, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి తీసుకురావాలన్నారు.
గోపాలకృష్ణ, రాగిరిబాబు, మధు సూదన్‌గౌడ్ బయట కాపలాగా ఉండగా, రాజేందర్, నవీన్‌కుమార్ లోపలికి వెళ్లి డబ్బు, నగలు తీసుకొస్తుండగా అలికిడికి లేచిన బాలమణి కేకలు వేయబోగా ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వచ్చారు. అనంతరం చోరీ సొత్తును పంచుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. తెల్లవారుజామున బాలమణి నోటికి ఉన్న ప్లాస్టర్ ఊడిపోవడంతో ఆమె కేకలు విన్న పక్కింటి వారు ఆమె కట్లను విప్పారు. దీనిపై చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 48 గంటల్లో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు చేధించిన మేడిపల్లి పోలీసులను సీపీ మహేష్‌భగవత్ అభినందించి రివార్డులు అందజేశారు.