బ్యాంకు ఉద్యోగుల మార్చ్ టు పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) విలీనం, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై బ్యాంకు ఉద్యోగులు మరోసారి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఢిల్లీ వేదికగా బ్యాంకు ఉద్యోగులు తమ పోరుకు దిగనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15 న ‘పార్లమెంట్ మార్చ్’ నిర్వహించనున్నట్టు బ్యాంకుల సంఘాలు ప్రకటించాయి.
సెప్టెంబరు 15న వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు బ్యాంక్ ఉద్యోగులు 'పార్లమెంటుకు మార్చ్' నిర్వహించనున్నట్లు ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దీపక్ కుమార్ శర్మ (చండీగఢ్ సర్కిల్) చెప్పారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి సిబ్బంది కొరత, దీర్ఘకాలిక నిధుల రికవరీ, ఎఫ్ఆర్డీఐ బిల్లు ఉపసంహరణ, ప్రజలపై భారం మోపుతున్న సర్వీస్ చార్జీల తగ్గింపు, డీమానిటైజేషన్ కాలానికి తమకు రావాల్సిన పరిహారం తదితర అంశాలపై ఈ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టు 22 న విజయవంతమైన అఖిల భారత సమ్మె తర్వాత, ఇండస్ట్రీ అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ' పార్లమెంట్ మార్చ్'కు పిలుపునిచ్చారని తెలిపారు. ఎస్బీఐ బ్యాంకుల విలీనం తదితరాలపై రాబోయే రెండు మూడు నెలల్లో దీనిపై తమ తీవ్ర నిరసనను తెలయజేయనున్నామని చెప్పారు.
కార్పొరేట్ రంగం సృష్టించిన భారీ ఎన్పీఏలపై ఆయన మండిపడ్డారు. బలమైన రాజకీయ సంకల్పం, కఠినమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లేకపోవడంతో రుణాలను తిరిగి పొందడంలో బ్యాంకర్లు విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఆందోళనకర స్థాయికి చేరుకున్న మొండి బకాయిల సమస్యను సరిదిద్దే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయట్లేదని ఆయన విమర్శించారు. పెరుగుతున్న ఎన్పీఎలను హైలైట్ చేయడం ద్వారా బ్యాంకుల పనితీరును ప్రభుత్వం నిరంతరం విమర్శిస్తోందని, తద్వారా బ్యాంకులను ప్రైవేటీకరించే యోచనలో వేగంగా కదులుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నవంబర్ 1, 2017 నాటికి కొత్త వేతన రివిజన్ చేయాల్సి ఉందనీ, దీనిపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబిఎ) స్పందించనుందని తెలిపారు.