లాభాలు ఒడిసి‘పట్టు’కున్నాడు..
‘నాలుగు ఎకరాల్లో నాలుగు వందల బత్తాయి చెట్లు నాటి న. ముప్పై సంవత్సరాలు పోరాడినా ఫలితం లేదు. నీళ్ల కోసం 7 బోర్లు వేయించినా సరిపోక చెట్లు మొత్తం చనిపోయాయి. తర్వాత మిర్చి సాగు చేస్తే వచ్చిన ఆదాయం కూలీలకు కూడా సరిపోలేదు. 40 గేదెలతో డెయిరీ ఫామ్ పెట్టా. ఇన్ని చేసినా చివరకు 14 లక్షల రూపాయల అప్పు మిగిలింది. 2009లో మా ఊర్లో ఓ రైతు పట్టు పురుగుల పెంపకం మొదలుపెట్టాడు.
పంటకు 200 గుడ్లు వ చ్చేవి. అంతకంటే ఎక్కువ గుడ్లు వచ్చేలా చూసుకుంటే మంచి ఆదాయం వస్తుంది కదా అని అనుకున్నా. 2010లో మల్బరీ మొక్కలు నాటా. పట్టు పరిశ్రమశాఖ ప్రోత్సాహకంతో పాటు కొంత అప్పు చేసి షెడ్డు నిర్మించుకున్నా. అప్పటి నుంచి వెనుదిరగి చూడలేదు. ఏడాదికి 9 నుంచి 10 పంటల మీద రూ.9 లక్షల ఆదాయం వస్తోంది.
ఒక్క పంట కూడా నష్టపోలేదు
మొదట్లో మూడు ఎకరాల్లో మల్బరీ మొక్కలు నాటా. ఇప్పుడు ఆరు ఎకరాల్లో వేశా. పంట సాగులో పట్టు పరిశ్రమ అధికారి బాలసుబ్రహ్మణ్యం చెప్పిన పద్ధతులు సక్రమంగా పాటించడంతో నేటి వరకు ఒక పంట కూడా నష్టపోలేదు. జోడు సాళ్ల పద్ధతి(3 ఁ3)లో నారు మొక్కలను నాటా. అలా చేస్తే మొక్కలు ఏపుగా పెరిగినా దున్నడానికి అనువుగా ఉంటుంది. ఎకరా మల్బరీకి టన్ను వేప పిండి, నాలుగు ట్రాక్టర్ల పశువుల ఎరువు వేస్తున్నా.
ఒక పంట పూర్తయిన తర్వాత 45 కేజీల బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని పవర్ స్ప్రేయర్‌తో షెడ్డంతా పిచికారీ చేసి శుభ్రపరుస్తా. క్లోరిన్ డయాక్సైడ్, ఫార్మాలీన్ రసాయనాలను ఫ్లేమ్ గన్ను ఉపయోగించి చంద్రికలు, షెడ్డు అరల్లో పిచికారీ చేసి వాటిని బ్యాక్టీరియా, వైరస్ రహితంగా ఉంచుతుండటంతో నాలుగేళ్లలో ఒక్క పంట కూడా నష్టపోలేదు. మూడు జ్వరాలు పూర్తయ్యేంత వరకు పురుగులపై మైనం పేపర్‌ను కప్పుతా. అందువల్ల ఆకు ఎండదు. పురుగులు ఆకును బాగా తింటాయి. పురుగులకు జ్వరం వచ్చినపుడు మాత్రం మైనం పేపర్(పారాపీన్) వేయకూడదు. ఆకు వేయడంలో అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ.. పురుగుల దశలకు అనుగుణంగా లేత నుంచి ముదురు ఆకు వేస్తున్నా. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ సోకకుండా ప్రైవేట్ మార్కెట్లో దొరికే మందు వాడుతున్నా.
కుటుంబమంతా పట్టు సాగులోనే..
ప్రతి పంటకు 600 గుడ్లు చేతికొస్తున్నాయి. 100 గుడ్లకు 50-60 కేజీల దిగుబడి వ స్తోంది. కేజీకి రూ.420-రూ.450 ధర దక్కుతోంది. ప్రతి పంటకు లక్ష రూపాయలకు పైగా మిగులుతోంది. ఏడాదిలో 9 పంటలకు రూ.9 లక్షల ఆదాయం వచ్చింది. ఉన్న అప్పును పంట అమ్మినప్పుడ ల్లా తీర్చుకుంటూ వచ్చా. బైఓల్టేన్ రకానికి కేంద్రం కేజీకి రూ.50, చాకీకి రూ.750 ప్రోత్సాహకం ఇస్తోంది.
పట్టు గూళ్లను అమ్మిన చోటే నగదు చెక్కు ఇస్తున్నారు. పట్టు గూళ్లను హిందూపురం మార్కెట్‌కు తీసుకెళ్తున్నా. పట్టు పురుగులను కంభంలో కొనుగోలు చేస్తున్నా. రెండో జ్వరం తర్వాత షెడ్డుకు పురుగులు తెచ్చుకుంటున్నా. కుటుంబం మొత్తం కలిసి పట్టు సాగు చేసుకుంటున్నాం. పట్టు గుడ్లను మార్కెట్‌కు తీసుకెళ్లే సమయంలో కూలీలు అవసరమవుతారు. సాగు సమయంలో కూలీల ఖర్చు ఉండదు’.