వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయండి
ఓస్లో: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు.
తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆస్తుల్ని విడుదల చేయాలని, రాజకీయపరమైన విభేదాలతో సాధారణ పౌరుల్ని శిక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకలి కేకలు, గడ్డ కట్టించే చలి పరిస్థితుల్లో స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమ దేశాల ప్రతినిధులు అఫ్గాన్ మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో మాట్లాడి అఫ్గాన్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.