Shiv Sena chief uddhavThackeray
-
ఎన్సీపీ.. ఎర్ర గురువింద గింజ
♦ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేసింది ♦ ఇప్పుడు ధర్నాలు చేస్తోంది.. అదో సిగ్గులేని పార్టీ ♦ బీజేపీ అడిగిందనే మద్దతిచ్చాం.. ♦ ‘సామ్నా’లో శివసేన అధినేత ఉద్ధవ్ వ్యాఖ్యలు సాక్షి, ముంబై : ‘ఎర్ర గురువింద గింజ తన నలుపెరగనట్లు’ అన్న చందంగా ఎన్సీపీకి తాను చేసిన పాపాలు గుర్తుకు రావు. వెలుగునిచ్చే దీపం కిందే చీకటి ఉన్నట్లు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా అక్రమాలు చేసింది. ఇప్పుడేమో ధర్నాలు చేస్తోంది. అదో సిగ్గులేని పార్టీ’ అని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీ పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చామని, అంతేకాని అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలను సంక్షోభంలోకి నెట్టడం ఇష్టం లేకనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. దీనిపై ఎవరేమనుకున్నా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. ‘ఇరుపార్టీల మధ్య ఉన్న 25 ఏళ్ల మైత్రి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెగిపోయింది. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. రాష్ట్ర హితం కోసమే బీజేపీతో కలసి పనిచేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో అధికారం మొత్తం శివసేన చేతిలోకి వచ్చే రోజులు దగ్గరపడ్డాయి. ఈ కల నా ఒక్కడిదే కాదు. యావత్ శివసైనికులు (కార్యకర్తలు) అందరిదీ. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు’ అని అన్నారు. అప్పుడు పాపాలు.. ఇప్పుడు ఆందోళనలు ‘బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. బీజేపీ అడిగిందనే సాయం చేశాం. ఎన్సీపీ సిగ్గు లేకుండా అడగకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడింది. మా మధ్య ఎప్పుడు పొత్తు వికటిస్తుంది, ఎప్పుడు బీజేపీతో జతకట్టాలని ఎదురుచూసింది.’ అని దుయ్యబట్టారు. ‘రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కాని కరవు పెద్ద సమస్యగా మారింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమస్యలేవీ పరిష్కరించలేదు. కాని ఇప్పుడు ఆ సమస్యలే పరిష్కరించాలని పట్టుబడుతోంది. వెలుగునిచ్చే దీపం కిందే చీకటి అన్నట్లు అధికారంలో ఉండగా అనేక పాపాలు చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా, ఆందోళనలు చేస్తున్నారు’ అని చురకలంటించారు. -
నా జన్మదిన వేడుకలు జరపొద్దు
♦ పార్టీ కార్యకర్తలకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విజ్ఙప్తి ♦ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టొద్దు ♦ వాటికయ్యే ఖర్చుతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోండి సాక్షి, ముంబై : తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించొద్దని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలకు విజ్ఙప్తి చేశారు. ప్రతిఏటా జూలై 27న జరిగే ఉద్ధవ్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు తరలివస్తారు. అయితే ఈ సారి రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా తదితర రీజియన్లలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి సమయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. రూ. లక్షలు ఖర్చు చేసి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోరారు. ‘గతేడాది రైతులకు పంట చేతికందలేదు. ఈ సారి విత్తనాలు మళ్లీ నాటాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీతో రైతుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి సంకట సమయంలో నేను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సబబు కాదు’ అని కార్యకర్తలు, అభిమానులకు ఉద్ధవ్ సందేశాన్నిచ్చారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం ఖర్చు చేసే డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందజేయాలని కోరారు.