ఎన్సీపీ.. ఎర్ర గురువింద గింజ | When in power has did many virtues | Sakshi
Sakshi News home page

ఎన్సీపీ.. ఎర్ర గురువింద గింజ

Published Sat, Jul 25 2015 2:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఎన్సీపీ.. ఎర్ర గురువింద గింజ - Sakshi

ఎన్సీపీ.. ఎర్ర గురువింద గింజ

♦ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేసింది
♦ ఇప్పుడు ధర్నాలు చేస్తోంది.. అదో సిగ్గులేని పార్టీ
♦ బీజేపీ అడిగిందనే మద్దతిచ్చాం..
♦ ‘సామ్నా’లో శివసేన అధినేత ఉద్ధవ్ వ్యాఖ్యలు
 
 సాక్షి, ముంబై : ‘ఎర్ర గురువింద గింజ తన నలుపెరగనట్లు’ అన్న చందంగా ఎన్సీపీకి తాను చేసిన పాపాలు గుర్తుకు రావు. వెలుగునిచ్చే దీపం కిందే చీకటి ఉన్నట్లు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా అక్రమాలు చేసింది. ఇప్పుడేమో ధర్నాలు చేస్తోంది. అదో సిగ్గులేని పార్టీ’ అని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీ పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చామని, అంతేకాని అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలను సంక్షోభంలోకి నెట్టడం ఇష్టం లేకనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. 

దీనిపై ఎవరేమనుకున్నా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. ‘ఇరుపార్టీల మధ్య ఉన్న 25 ఏళ్ల మైత్రి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెగిపోయింది. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. రాష్ట్ర హితం కోసమే బీజేపీతో కలసి పనిచేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో అధికారం మొత్తం శివసేన చేతిలోకి వచ్చే రోజులు దగ్గరపడ్డాయి. ఈ కల నా ఒక్కడిదే కాదు. యావత్ శివసైనికులు (కార్యకర్తలు) అందరిదీ. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు’ అని అన్నారు.

 అప్పుడు పాపాలు.. ఇప్పుడు ఆందోళనలు
 ‘బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. బీజేపీ అడిగిందనే సాయం చేశాం. ఎన్సీపీ సిగ్గు లేకుండా అడగకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడింది. మా మధ్య ఎప్పుడు పొత్తు వికటిస్తుంది, ఎప్పుడు బీజేపీతో జతకట్టాలని ఎదురుచూసింది.’ అని దుయ్యబట్టారు. ‘రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కాని కరవు పెద్ద సమస్యగా మారింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమస్యలేవీ పరిష్కరించలేదు. కాని ఇప్పుడు ఆ సమస్యలే పరిష్కరించాలని పట్టుబడుతోంది. వెలుగునిచ్చే దీపం కిందే చీకటి అన్నట్లు అధికారంలో ఉండగా అనేక పాపాలు చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా, ఆందోళనలు చేస్తున్నారు’ అని చురకలంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement