సీమాంధ్రుల అభిప్రాయాలను పరిశీలిస్తాం:సోనియా
న్యూఢిల్లీ: సీమాంధ్ర నేతల అభిప్రాయలను పరిశీలిస్తామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు. సీమాంధ్రకు చెందిన ఏడుగురు కేంద్ర మంత్రులు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన తరువాత పళ్లంరాజు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమ తీవ్రతను, సీమాంధ్రుల అభద్రతా భావాన్ని సోనియాకు వివరించినట్లు చెప్పారు. సీమాంధ్రుల మనోభావాలను గౌరవించాలని కోరినట్లు తెలిపారు.
తెలంగాణపై కమిటీ పూర్తి అయ్యేంతవరకు విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన చెప్పారు. ఆంటోనీ కమిటీకి అన్ని వివరాలు చెప్పమని సోనియా కోరినట్లు తెలిపారు. శాంతియుతంగా ఉండాలని సీమాంధ్ర ప్రజలను కోరుతున్నామన్నారు.