పెళ్లికొడుకు పరారీ
రాజంపేట రూరల్: పెళ్లికుమారుడు బోగా బాలాజీ పరారీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ హెడ్‌కానిస్టేబుల్ కందల నరసింహులు ఆదివారం తెలిపారు. పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లెకు చెందిన బోగా బాలాజీ, కడప శంకరాపురానికి చెందిన ఓ యువతికి ఈ నెల 7న నిశ్చితార్థ కార్యక్రమం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బ్రహ్మంగారి ఆలయ కల్యాణ మండపంలో వారి వివాహం జరగాల్సి ఉందన్నారు. శనివారం రాత్రి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లికొడుకు బంధువులు లాంఛనాలతో బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారన్నారు. అక్కడ నిర్వహించిన రిసెప్షన్ అనంతరం పెళ్లికుమారుడు బోగా బాలాజీ కనిపించకుండా పోయాడన్నారు. పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తన కుటుంబాన్ని అవమానపాలు చేయడానికే పెళ్లికుమారుడు, అతని తల్లిదండ్రులు, అన్నవదినలు, అక్కాబావలు ఇలా చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.