సీమ అభివృద్ధే బీజేపీ ధ్యేయం
కర్నూలు(సిటీ): రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే బీజేపీ ధ్యేయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ వీర్రాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బీజేపీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసిన జాతికి అంకితం చేస్తామని పార్టీ ఇప్పటికే ప్రకటించిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సీమ ప్రాంతానికి 40 టీఎంసీల నీరు వస్తుందన్నారు. భద్రాచలం పరిధిలోని మరో మూడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.
తద్వారా దుమ్ముగూడెం ద్వారా సీమకు నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య అన్నారు. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చి ప్రభుత్వం తిరిగి తీసుకుందని, సెయిల్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ అక్కడే ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి మూలింటి మారెప్ప పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రావడంతో దేశ ప్రజలకు మంచిరోజుల వచ్చాయని సినీ నటుడు సురేష్ అన్నారు.
బీజేపీ విధానాలు నచ్చే ఆ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. కర్నూలు, కల్లూరు, పాణ్యం, బనగానపల్లె తదితర మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. వీరందరికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురంధేశ్వరి, మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు శాంతారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీంద్ర రాజు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్‌బాబు, సందడి సుధాకర్, రంగస్వామి, కాళంగి నరసింహవర్మ పాల్గొన్నారు.