అళగిరికి చెక్
సాక్షి, చెన్నై: అళగిరిని పక్కన పెట్టేందుకు డీఎంకే సమాయత్తం అవుతున్నట్టుంది. ఇందుకు అన్నా అరివాళయం వెలువరించిన ఓ ప్రకటన బలం చేకూరుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో దక్షిణాది కింగ్ మేయర్ అళగిరి పేరు మిస్సింగ్ కావడం డీఎంకే వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజ కీయ వారసత్వం కోసం డీఎంకేలో పెద్ద సమరమే జరుగుతోం ది. ఆయన తనయులు అళగిరి, స్టాలిన్ మధ్య చోటు చేసుకుం టూ వస్తున్న ఈ సమరం క్రమంగా ముదురుతోంది. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు కరుణ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు.
తన రాజకీయ వారసుడు స్టాలినే అంటూ కరుణానిధి ఇటీవల పరోక్ష వ్యాఖ్యలు చేయడం అళగిరి, ఆయన మద్దతుదారులకు మింగుడుపడటం లేదు. అసలే అగ్గి మీద బుగ్గిలా ఎగసి పడుతున్న అళగిరికి కేంద్రంలో మంత్రి పదవి దూరం కావడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలగిన నాటి నుంచి అళగిరి ఆగ్రహంతోనే ఉన్నారు.
తగ్గిన ప్రాధాన్యత: తనతో మాట వరుసకైనా చెప్పకుండా కూటమి నుంచి వైదొలగడాన్ని అళగిరి తీవ్రంగా పరిగణించారు. దక్షిణాది జిల్లాల పార్టీ నిర్వాహక కార్యదర్శిగా ఉన్న తనకు ప్రాధాన్యత తగ్గుతోందన్న మనోవేదనలో పడ్డారు. అదే సమయంలో తనకు తెలియకుండానే దక్షిణాది జిల్లాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలకు పిలుపు నివ్వడం జీర్ణించుకోలేక పోయారు. దీంతో ధిక్కార సర్వాన్ని పెంచే పనిలో పడ్డారు.
ఁ్ఙడీఎంకే ఏమైనా మఠమా..!, స్నేహం వేరు...పార్టీ వేరు..! తాను తలచుకుంటే పార్టీ చీలుద్దీ...!, మౌనంతో అన్నీ భరిస్తున్నా...!, ఏదో ఒక రోజు ఉప్పెనలా ఎగసి పడుతా...! ఇలా అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. కుటుంబ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. కొన్నాళ్లు అమెరికాలో ఉన్న అళగిరి రెండు నెలల క్రితం చెన్నైకు తిరిగి వచ్చారు. కరుణానిధిని కలుసుకుని తన ఆక్రోశాన్ని వెల్లగక్కే యత్నం చేశారు. అయితే, కరుణానిధి అనుమతి మాత్రం అళగిరికి దక్కలేదు.
హాట్ టాపిక్: ఇష్టానుసారంగా నడచుకుంటూ పార్టీలో, మీడియాల్లో అళగిరి హాట్ టాపిక్‌గా మారారు. ఆరేడు నెలలకు పైగా అందరికీ దూరంగా ఉంటున్న అళగిరి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్ని, అత్యవసర, సర్వసభ్య సమావేశాలకు డుమ్మా కొట్టారు. దీన్ని డీఎంకే అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. అళగిరి తీరును ఆయన మార్గంలోనే ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. పార్టీకి దూరంగా ఉన్న అళగిరిని ప్రశ్నించకుండా...! అలాగే వదలి పెట్టి, చివరకు చెక్ పెట్టే పంథాను అధిష్టానం అనుసరిస్తున్నట్టుంది. చిన్న కుమారుడు స్టాలిన్‌కు రానురాను కరుణానిధి పెద్ద పీట వేయడం చూస్తే, అళగిరికి ప్రాధాన్యత తగ్గినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా డీఎంకే అధిష్టానం విడుదల చేసిన ఓ ప్రకటనలో అళగిరి పేరు మిస్ కావడం గమనార్హం.
మిస్సింగ్ : డీఎంకే సర్వ సభ్యసమావేశం తీర్మానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలకు డీఎంకే పిలుపు నిచ్చింది. ఏఏ నేత ఎక్కడ పాల్గొంటారోనన్న వివరాల్ని పార్టీ అధిష్టానం వివరించింది. చెన్నైలో అధినేత కరుణానిధి, సీనియర్ నేత దురై మురుగన్, కంచిలో స్టాలిన్, తూత్తుకుడిలో ఎంపీ కనిమొళి, పుదుకోట్టైలో పార్టీ పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు, తిరువ ణ్ణామలైలో తిరుచ్చి శివ, సేలంలో నటి ఖుష్బు, మదురైలో ఎంపి దయానిధి మారన్, ఇలా పార్టీలోని ముఖ్య నాయకులు, ఎంపీలు, మాజీలకు ఆయా జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలకు నేతృత్వం వహించే అవకాశం కల్పించారు. అయితే, అళగిరి పేరు మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది. అళగిరి అడ్డా అరుున మదురైలో జరిగే సభకు దయానిధి మారన్ నేతృత్వం వహిస్తుండటంతో ఁచెక్*అన్నపదానికి బలం చేకూరుతోంది. అళగిరి పేరు మిస్ కావడం ఆయన మద్దతుదారుల్లో ఆక్రోశాన్ని రగుల్చుతోంది. మున్ముందు రోజుల్లో ఈ ప్రకటన కారణంగా అళగిరి వర్గంలో ఎలాంటి దుమారం రేగబోతుందో వేచిచూడాల్సిందే.