ఆటలో ‘అరటిపండు’
మాడ్రిడ్: క్రీడల్లో జాతి వివక్ష ఉదంతాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఒక ఆటగాడిపై ప్రత్యర్థి ప్లేయర్ నోరు పారేసుకోవడమో లేదంటే ప్రేక్షకులు ఏదో కామెంట్ చేయడమో కనిపిస్తుంది. దానికి ప్రతిస్పందనలు, వివాదాలు సహజమే. అయితే బ్రెజిల్ ఫుట్‌బాలర్ డేనియల్ ఆల్వ్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
స్పానిష్ లీగ్‌లో బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతనికి విల్లారియల్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. అతను కార్నర్ తీసుకునే సమయంలో ప్రేక్షకుల్లోంచి ఎవరో జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ మైదానంలో అరటి పండు విసిరారు. అయితే ఆల్వ్స్ ఆగ్రహించలేదు. ఆ అరటిపండును ఒలిచి తింటూ ఇదీ నా సమాధానం అంటూ చూపించాడు. ఈ చర్య ప్రపంచ క్రీడారంగం దృష్టిని ఆకర్షించింది. అగ్రశ్రేణి ఫుట్‌బాల్ క్రీడాకారులు సహా క్రీడా ప్రముఖులంతా డేనియల్ చర్యకు మద్దతు పలికారు. ‘జాతి వివక్ష వద్దు’ అంటూ అంతా అరటి పళ్లు తింటూ ఫొటోలు దిగారు. సోషల్ వెబ్సైట్లలో వాటిని ఉంచి తమ సంఘీభావం ప్రకటించారు!