శ్రీలక్ష్మి ఏం చేసిందో తెలుసా?
‘మనం ఎప్పుడు కలుద్దాం, మీ రేటు ఎంత, రూ. 3000కు వస్తావా, హోటల్ గది బుక్ చేయమంటారా’.... కేరళ మహిళ శ్రీలక్ష్మి సతీశ్ కు వచ్చిన ఫోన్లలో వినిపించిన మాటలు ఇవి. విద్యా సంస్థ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్న ఆమెకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు. ఒకడైతే రూ. 25000 ఇస్తానని వాగాడు. ఇవన్నీ భరించలేక ఆమె సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు.
అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు తనకు ఫోన్ చేసిన వారికి ఆమె మళ్లీ ఫోన్ చేశారు. తన నంబర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ తో జరిపిన సంభాషణ స్ర్కీన్ షాట్లను ఆమె సంపాదించారు. దీని ఆధారంగా తన ఫోన్ నంబర్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు ఒక జాతీయ పార్టీ యువజన విభాగంలో ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇంతలో పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని కోర్టు బయటే రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు శ్రీలక్ష్మి పలు షరతులు విధించారు. తన ఫోన్ నంబర్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనికి సంబంధించిన సమావేశం వివరాలు తనకు అందించాలని నిష్కర్షగా చెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.
ఇంతలో నిందితుడి తండ్రి శ్రీలక్ష్మి వద్దకు వచ్చి తన కొడుకును క్షమించాలని, కేసు పెట్టొద్దని వేడుకున్నాడు. తాను చెప్పినట్టుగా చేస్తే కేసు పెట్టనని చెప్పడంతో ఆయనకు ప్రాణం లేచొచ్చింది. నిందితుడు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కూ. 25000 విరాళం ఇవ్వాలని, దీనికి సంబంధించిన రసీదు తనకు అందజేయాలని అన్నారు. శ్రీలక్ష్మి చెప్పినట్టుగానే చేసి రసీదు ఆమెకు ఇచ్చారు.
తన కోపం చల్లారకపోవడంతో ఈ వ్యవహారం గురించి తన ఫేస్ బుక్ పేజీలో వివరంగా రాశారు. దీనికి 1317 షేర్లు, 1200 కామెంట్లు, 4500 లైకులు వచ్చాయి. తనను అవమానించిన వాడికి తగిన గుణపాఠం చెప్పారని శ్రీలక్ష్మిని అందరూ ప్రశంసించారు. అయితే ఇదంతా తాను ప్రచారం కోసం చేయలేదని ‘మలయాళం మనోరమ’తో శ్రీలక్ష్మి చెప్పారు.