జైళ్లలో మెనూ మార్పు
యలమంచిలి : రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షఅనుభవిస్తున్న, రిమాండ్ ఖైదీలకు శుభవార్త. వారి మెనూ మార్పు చేస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. పెలైట్ ప్రాజెక్టుగా నెల రోజుల పాటు జిల్లా కేంద్ర కారాగారాలు, ఉపకారాగారాల్లో ఇప్పటి వరకు అమలు చేస్తున్న మెనూలో పలుమార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది విజయవంతమైతే వచ్చే ఏడాది నుంచి మారిన మెనూను అమలు చేస్తారు. దీనిపై యలమంచిలి సబ్‌జైల్ సూపరింటెండెంట్ పి.సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఖైదీలకు పప్పుదినుసులను మాత్రమే ఇచ్చేవారు.
ఇప్పుడు దీనికి అదనంగా ఆకుకూరలతో కూడిన పప్పునుఅందించనున్నారు. ఉదయం అల్పాహారంలో ఇప్పటి వరకు పులిహోరను రోజూ ఇస్తున్నారు. మార్పు చేసిన మెనూలో ఉదయం అల్పాహారం జాబితాలో పొంగలి, చపాతి, ఉప్మా, పులిహోర పెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రతీ శనివారం అరటిపండు, మంగళ, శుక్రవారాల్లో కోడిగుడ్డు, శాకాహారులకు అరటిపండు, నెలలో మొదటి ఆదివారం మటన్, మిగతా ఆదివారాలు చికెన్‌తో కూడిన కూరలు ఖైదీలకు పెడతారు. ఈ మేరకు అన్ని జైళ్లకు సమాచారం అందింది. దీని ప్రకారం బుధవారం నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు పెలైట్ ప్రాజెక్టుగా మారిన కొత్త మెనూను అమలు చేయనున్నట్టు జైళ్ల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పు పట్ల ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.