‘దీప్తి’నే...ఆర్పేసింది
అమ్మా, నాన్నల మనస్పర్థలేమిటో ఆ పసి మనసుకు తెలియవు మొదటి తల్లికి పేగు తెంచుకు పుట్టానని నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని వచ్చిన ఆమె సవతి తల్లి అని కూడా తెలుసుకోలేని పసితనం నాన్న జీవితంలోకి వచ్చిన ఆమే తన సర్వస్వం అనుకుంది... దేవుడిచ్చిన అమ్మేనని మురిసిపోయింది కానీ... ఈ అమ్మ మదిలో అంత విషం ఉంటుందని చూపించే ఆ ప్రేమలో అంత కలుషితం పేరుకుపోయిందని లాలించే ఆ చేతుల్లో, చేతల్లో చేదు నిజం దాగుందని తెలుసుకోలేకపోయింది. ఆ పసి హృదయం.. కొడుకు పుట్టిన తరువాత క్రోధం బుసకొట్టింది. ఆ బిడ్డకు ‘మీ అక్కరా’ అంటూ పరిచయం చేసి ఆప్యాయతను పంచాల్సిన ఆమె సంకుచితత్వం పెంచుకుంది. తిట్టడం, కొట్టడం, వాతలు పెట్టినంతవరకూ వెళ్లింది. మా అమ్మే కదా అని అన్నీ భరించింది... ప్రాణం తీసేంత పాషాణ హృదయమని ఊహించలేకపోయింది శాంతి పేరుపెట్టుకున్న ఆమె దీప్తినే ఆర్పేసింది.
సాక్షి, కాకినాడ క్రైం: నగరంలోనేకాదు.. రాష్ర ్ట వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి దీప్తిశ్రీ ఐసాని (7) హత్య కేసులో ఉత్కంఠ వీడింది. ఆమెను హత్య చేసింది సవతి తల్లి శాంతి కుమారి అని పోలీసుల విచారణలో నిర్థారణ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం కావడంతో 72 గంటల ఉత్కంఠకు తెరపడింది. సవతి కూతురు దీప్తిశ్రీని తన భర్త సత్యశ్యామ్‌కుమార్ గారాబంగా చూడడం, తన అత్త, ఆడపడుచులు దీప్తిశ్రీకి నెలకు రూ. 8 వేలు ఇవ్వాలని శ్యామ్‌కుమార్‌ను అడగడంతో కక్ష పెంచుకున్న సవతి తల్లి శాంతికుమారి ఈ హత్యకు పాల్పడింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 12.45–ఒంటి గంట మధ్యలో కాకినాడ జగన్నాథపురంలోని నేతాజీ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల నుంచి దీప్తిశ్రీని శాంతికుమారి తీసుకు వెళ్లింది. తన తల్లి వచ్చిందని, తాను అమ్మతో కలసి వెళ్తున్నట్టు దీప్తిశ్రీ తోటి విద్యార్థులకు చెప్పడం కేసుకు బలమైన ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీప్తిశ్రీని శాంతికుమారి తీసుకు వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్‌లో కని్పంచడంతో శాంతికుమారిని తీసుకు వెళ్లి విచారణ చేపట్టారు. తానే దీప్తిశ్రీని తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి కట్టివేసి ఇంద్రపాలెం వంతెన నుంచి కాలువలో పడేసినట్టు శాంతికుమారి విచారణలో తెలిపింది. ఆమె చెప్పిన మేరకు పోలీసులు మూడున్నర రోజులుగా దీప్తిశ్రీ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఇంద్రపాలెం వంతెన సమీపంతో పాటు ఉప్పుటేరులో జగన్నాథపురం వంతెన ప్రాంతంలోను గాలింపు చేపట్టారు. దీప్తిశ్రీ మృతదేహం దొరకకపోవడంతో ధర్మాడి సత్యం బృందం సహాయం తీసుకున్నారు.
చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం ఉన్న మూట
ర్మాడి సత్యం బృందం, పోలీసు బృందాలు సోమవారం ఉదయం నుంచి ఇంద్రపాలెం వంతెన సమీపంలో జల్లెడ పట్టాయి. వంతెన సమీపంలో అత్యధికంగా గుర్రపుడెక్క పేరుకుపోయి ఉండడంతో ధర్మాడి సత్యం బృందం, పోలీసులు అక్కడ వెతకగా మధ్యాహ్నం 2.30 గంటల సమ యంలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారం దావానలంలా వ్యాపించడంతో దీప్తిశ్రీ కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వచ్చారు. దీప్తిశ్రీ తండ్రి సత్యశ్యామ్‌కుమార్ తన కుమార్తె చనిపోయిందని తెలియగానే కుప్పకూలిపోయాడు. నలుగురు మేనత్తలు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎప్పుడూ దీప్తిశ్రీని ఇష్టంగా చూడకపోయినా, అట్లకాడతో వాతలు పెడుతున్నా, వేడినీళ్లు, గంజి వంటివి వంటిపై పోసి హింసిస్తున్నా ఏనాడూ ఆ చిన్నారి తమకు చెప్పలేదని మేనత్తలు విలపించారు. ఎప్పుడూ మమ్మి, మమ్మి అంటూ ఎంతో ఆప్యాయతగా తిరిగే చిన్నారిని చంపేందుకు శాంతికుమారికి ఎలా మనస్సు వచ్చిందంటూ వారు విలపించిన తీరు చూపరులను కలచి వేసింది.
ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో చిన్నారి దీప్తిశ్రీ కోసం వెతుకుతున్న బృందాలు
తన కుమార్తెను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నానని, తన రెండో భార్య కూడా అదే విధంగా చూసుకుంటుందని భావించానే తప్ప, ఇలా తన చిన్నారిని హింసిస్తూ చివరికి చంపేస్తుందని ఏనాడూ తాను ఊహించలేకపోయానని దీప్తిశ్రీ తండ్రి సత్యశ్యామ్‌కుమార్ విలపించిన తీరు చూపరులకు కన్నీరు పెట్టించింది. అతనిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. దీప్తిశ్రీ ఉంటే తనకు పుట్టిన కొడుకుని భర్త పట్టించుకోడని భావించి హత్య చేసిందని కుటుంబ సభ్యులు వివరించారు. గతంలో శాంతికుమారి తల్లితో కలసి తండ్రిని హత్యచేసిందని ఈ సందర్భంగా పలువురు చెప్పుకున్నారు. ఆమెకు నేరచరిత్ర ఉండడం వల్లే దీప్తిశ్రీని ఇలా హత్య చేసి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిందని పలువురు వ్యాఖ్యానించారు.
ఒంటరిగానే హతమార్చింది
దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి ఒంటరిగానే హత్యమార్చిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. ఇంద్రపాలెం వంతెన వద్ద దీప్తిశ్రీ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం నయీం అస్మీ విలేకరులతో మాట్లాడారు. శాంతికుమారి జగన్నాథపురంలోని పాఠశాల నుంచి దీప్తిశ్రీని సంజయ్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి ఆమె గొంతుకకు తువ్వాలు బిగించి హత్య చేసినట్టు ఆయన వివరించారు. దీప్తిశ్రీ మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి ఒక షేర్ ఆటోలో తన కుమారుడిని ఒక పక్క ఎత్తుకొని మరొక పక్క దీప్తిశ్రీ మృతదేహాన్ని పెట్టుకొని ఇంద్రపాలెం వంతెన వద్దకు వచ్చిందన్నారు.
విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేస్తున్న ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పోలీసు అధికారులు
దీప్తిశ్రీని కిడ్నాప్ చేసిన విషయం సీసీ ఫుటేజ్‌ల ద్వారా తెలిసిందన్నారు. దీప్తిశ్రీ కోసం భర్త సత్యశ్యామ్‌కుమార్ ప్రతి నెల రూ.8 వేలు ఖర్చు చేస్తున్నట్టు ఊహించుకొని ఆమెపై శాంతికుమారి ద్వేషం పెంచుకుందన్నారు. ఆ నేపథ్యంలోనే హత్య చేసిందన్నారు. ఇంద్రపాలెం వంతెనకు 15 మీటర్లు సమీపంలోనే మృతదేహాన్ని ధర్మాడి సత్యం బృందంతో కలసి పోలీసులు వెలికి తీసినట్టు ఎస్పీ తెలిపారు. ధర్మాడి సత్యం బృందాన్ని ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అభినందించారు. నిందితురాలిపై కిడ్నాప్, హత్య నేరాలు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కరణం కుమార్, భీమారావు, రూరల్ సర్కిల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, సీఐలు రామ్మోహన్‌రెడ్డి, ఈశ్వరుడు, శ్రీరామకోటేశ్వరరావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.