విలన్‌గా నన్ను తీసుకోమని అక్షయ్‌కుమార్ రికమెండ్ చేశారు: సుమన్
36 ఏళ్ల కెరీర్... దక్షిణాది భాషలన్నింటిలో కలిపి400 సినిమాలు... ఇదీ సుమన్ ట్రాక్ రికార్డ్. హీరో, విలన్, కేరెక్టర్ ఆర్టిస్ట్... ఇలా ఏది చేసినా సుమన్ స్టయిలే వేరు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సుమన్ ప్రత్యేకంగా సంభాషించారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది బిజీగా ఉన్నట్లున్నారు?
అవునండి. పైగా... ఇప్పుడు చేస్తున్నవేవీ సామాన్యమైన సినిమాలు కావు. క్రిష్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్న హిందీ ‘గబ్బర్’ లో విలన్‌గా చేస్తున్నా. ‘శివాజీ’ సినిమా చూసి, తన ఎత్తుకీ, పర్సనాల్టీకి విలన్‌గా నేనేతై బాగుంటానని అక్షయ్ అన్నారట. క్రిష్‌కి నేను రాజకీయ నాయకుడి వేషానికి బాగుంటాననిపించి తీసుకున్నారు.
36 ఏళ్ల కెరీర్లో మీరు చేస్తున్న తొలి హిందీ సినిమా ఇది. అసలింతకు ముందెప్పుడూ ప్రయత్నించలేదా?
కెరీర్ ఆరంభంలో హిందీ సినిమాలు చేయాలని ఉండేది. కొంత ప్రయత్నం చేశాను. ఆ తర్వాత మానుకున్నాను. మనకు రావాలని రాసిపెట్టి ఉన్నప్పుడే వస్తుందనుకున్నాను. ఇప్పుడొచ్చింది.
హిందీ కాకుండా దక్షిణాదిన మీరు చేస్తున్న చిత్రాల గురించి?
చంద్రమహేశ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాను. ఇప్పటివరకూ ఏకకాలంలో రెండు భాషల్లో సినిమాలు చేశాను కానీ, ఒకేసారి నాలుగు భాషల్లో చేయడం ఇదే మొదటిసారి. నాగచైతన్య ‘ఒక లైలా కోసం’లో కీలక పాత్ర చేశాను. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య.. ఇలా మూడు తరాల నటులతో సినిమా చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది. అలాగే ‘రుద్రమదేవి’లో కూడా నటిస్తున్నా. ఇంకా కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా రూపొందుతున్న ‘వజ్రకన్య’లోనూ, తమిళంలో ఓ చిత్రంలోనూ నటిస్తూ, బిజీగా ఉన్నాను.
మీ డెరైక్షన్‌లో సినిమా అన్నారు. ఏమైంది?
మార్షల్ ఆర్ట్స్‌పై అవగాహన కలిగించే సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. కానీ, తొందరపడదల్చుకోలేదు. నటునిగా నాలుగు వందల సినిమాల అనుభవం ఉన్నప్పటికీ, నిర్మాణం పరంగా లేదు. అందుకే, ఆచితూచి సినిమా చేయాలనుకుంటున్నాను. తొందరపడి మొదలుపెట్టి, మధ్యలో సినిమా ఆగిపోతే అది నాకు పెద్ద మైనస్ అవుతుంది కదా.
మన దేశంలో మార్షల్ ఆర్ట్స్ గురించి అవగాహన ఉందంటారా?
అంతగా లేదు. శరీరానికి, ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అందుకే, మన రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను.
కుంగ్‌ఫూ, కరాటే నేర్పించడంతో పాటు, వాటి ప్రాధాన్యాన్ని చెబుతున్నాను.
రాష్ర్టం రెండుగా విడిపోయాక, చిత్రపరిశ్రమ హైదరాబాద్‌లో ఉండాలని కొంతమంది, వైజాగ్ వెళ్లిపోవాలని మరికొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు?
చెన్నయ్ నుంచి చిత్రపరిశ్రమ ఇక్కడికొచ్చి, సెటిల్ కావడానికి దాదాపు పదిహేనేళ్లు పట్టింది. అప్పట్లో అంతా స్మూత్‌గా జరిగిపోయింది. మళ్లీ ఇక్కణ్ణుంచీ వైజాగ్ అంటే అంత సులువైన విషయం కాదు. అది పెద్ద ప్రక్రియ... భారం కూడా. ఇక్కడే మనకు చాలా స్టూడియోలున్నాయి. హాయిగా షూటింగ్స్ చేసుకోవచ్చు. మరి.. పన్నుల విషయంలో ఈ రాష్ట్రం ఏం నిర్ణయిస్తుందో చూడాలి. రాష్ట్రం విడిపోయినా... మనమంతా ఒక్కటే అనే భావనే నాకుంది. షూటింగ్స్‌కి హైదరాబాద్ బెస్ట్. వైజాగ్‌కి సైక్లోన్ థ్రెట్ ఉంది. హైదరాబాద్‌లో మంచి సౌకర్యాలు ఉన్నాయి. వైజాగ్ వాతావరణంతో పోల్చుకుంటే.. షూటింగ్స్‌కి హైదరాబాద్ బాగుంటుంది. అందుకని, ఇక్కడే ఉండటం మంచిదని నా అభిప్రాయం. కళాకారులకు రాష్ట్రాలతో సంబంధం లేదు. వాళ్లు ప్రజల మనుషులు. ఎక్కడైనా ఉండొచ్చు.
ఈరోజు మీ అమ్మాయి బర్త్‌డే కూడా కదా?
అవును. ప్రతి ఏడాదీ ఈరోజు మా ఇంట్లో రెండు పండగలు. తనిప్పుడు ఫ్లూయిడ్ సెన్సైస్‌లో సెకండ్ ఇయర్ చేస్తోంది. థర్డ్ ఇయర్ పూర్తయ్యాక పరిశోధనల మీద దృష్టి పెడుతుంది. మొదట్నుంచీ మా అమ్మాయి ఈ బాటలోనే వెళ్లాలనుకుంది. తన ఇష్టాన్ని నేను, మా భార్య కాదనలేదు. ఆ మాటకొస్తే... మాది లవ్లీ ఫ్యామిలీ అనే చెప్పాలి. షూటింగ్స్ కారణంగా ఒక్కోసారి చాలా ఒత్తిడిగా ఉండి, నా మూడ్ బాగాలేకపోయినా అర్థం చేసుకుని, నా కష్టసుఖాలను పంచుకుంటున్న నా భార్య, మా అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే.
నాగ విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నా!
ఉడిపిలోని హెజమాడీ గ్రామం మాది. అక్కడి గ్రామదేవత ‘నాగదేవత’. ప్రతి కిలోమీటర్‌కో నాగదేవత గుడి ఉంటుంది. ఈ పుట్టినరోజు నాడు నేను ఓ గుడిలో నాగ విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నాం. రేపు వినాయక చవితి కూడా మా ఊళ్లోనే జరుపుకోబోతున్నాం. నా భార్య శిరీష, మా అమ్మాయి ప్రత్యూష... ఇలా మా కుటుంబమంతా హెజమాడీలో ఉన్నాం.
- డి.జి. భవాని