in summer
-
110 గ్రామాలు.. ఒకటే గంటల కారు
భీమవరం టౌన్ : వేసవి కాలం ఎండలు ముదురుతున్నాయి. ఇది అగ్ని ప్రమాదాల సీజన్ కావడంతో అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న పట్టణాల్లో భీమవరం మూడోస్థానంలో ఉంది. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకూ పరిశీలిస్తే ఇక్కడ 103 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మిగిలిన పట్టణాలకంటే భిన్నమైన పరిస్థితి. అక్టోబర్ నుంచి జనవరి వరకూ అగ్నిప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నట్టు అగ్నిమాపక అధికారులు గుర్తించారు. చలిమంటలు సరిగా ఆర్పకపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ అయిపోతే కుదిపి వెలిగించే ప్రయత్నం చేయడం తదిర అంశాలు ప్రమాదాలకు కారణాలుగా గుర్తించారు. దీనిబట్టి ఏడాది పొడవునా భీమవరంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఒకే ఒక అగ్నిమాపక వాహనం ఉంది. భీమవరం పట్టణం, మండలం, పాలకోడేరు, వీరవాసరం, ఉండి, కాళ్ల మండలాల పరిధిలో కొన్ని గ్రామాలతో కలిపి మొత్తం 110 గ్రామాలకు ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం సేవలు అందించాల్సి వస్తుంది. గతంలో రెండు అగ్నిమాపక వాహనాలు ఉండేవి. 2016 ఏప్రిల్‌లో ఇక్కడి నుంచి ఒక వాహనాన్ని కుక్కునూరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక అగ్నిమాపక కేంద్రానికి అధికారులు పంపించారు. అప్పటి నుంచి ఇక్కడి కేంద్రానికి మరో వాహనాన్ని కేటాయించ లేదు. దీంతో ఒకే సమయంలో ఎక్కడైనా రెండు ప్రమాదాలు జరిగితే సిబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. సమయానికి గమ్యానికి చేరుకోవడం కష్టసాధ్యం. సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 31 పోస్టులకు గాను 12 ఖాళీగా ఉన్నాయి. అధునాతన యంత్ర సామగ్రి మిస్ట్ బుల్లెట్, మిస్ట్ జీప్, రెస్క్యూబోట్ వంటివి ఉన్నతాధికారులు సమకూర్చినా ఎక్కువ నీటి స్థాయి కలిగిన అగ్నిమాపక వాహనం మరొకటి అవసరం. 1983లో నిర్మించిన రేకుల షెడ్లోనే కేంద్రం కొనసాగుతోంది. ఇక్కడి కేంద్రానికి మరో అగ్నిమాపక వాహనాన్ని అధికారులు సమకూర్చి సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. -
కూల్ ఖాదీ!
వేసవి వేడికి చెక్ పెట్టాలంటే నూలు దుస్తులదే కీలక పాత్ర. అందులోనూ స్వచ్ఛమైన ఖాదీ దుస్తులైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటిని నిలువరించి మేనికి హాయినిస్తాయి. పెద్దలు ధరించే దుస్తుల కోటాలో చేరిపోయిన ఖాదీ పిల్లలు, యువత వార్డ్‌రోబ్‌లోనూ ఆకర్షణీయంగా కనువిందుచేయాలంటే... వారి ముస్తాబు మోడ్రన్‌గా మెరిసిపోవాలంటే ఖాదీ దుస్తుల డిజైనింగ్‌లో ఆధునిక హంగులను తీసుకురావాలి. పిల్లలతో పాటు కాలేజీ విద్యార్థులను, కార్పొరేట్ ఉద్యోగులనూ ఆకట్టుకునే కూల్ ఖాదీ దుస్తుల డిజైన్లు ఇవి. 1- కోరా ఖాదీ (హాఫ్‌వైట్) కుర్తా నేటి మహిళకు సరిగ్గా నప్పుతుంది. వంగపండు రంగు డబుల్ థ్రెడ్ ఖాదీ పైజామా దీనికి సరైన ఎంపిక. అధిక వేడిమి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. కార్పొరేట్ కంఫర్ట్‌కి, కాలేజీ స్టైల్‌కి బాగా సూటవుతుంది. 2-కాలేజీకి వెళ్లే అమ్మాయిల కోసం రూపొందించిన డ్రెస్ ఇది. ‘వి’ నెక్ గల కలంకారి ఖాదీ బ్లౌజ్, ప్రింటెడ్ ఖాదీ స్కర్ట్ ధరిస్తే అటు క్యాజువల్‌గానూ, ఇటు కలర్‌ఫుల్‌గానూ కనిపిస్తారు. 3- టై అండ్ డై ఖాదీ క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. పై భాగంలో క్రోచెట్ని జత చేయడంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 4- టై అండ్ డై చేసిన ఖాదీ మెటీరియల్‌తో తీర్చిదిద్దిన ఫ్రాక్ ఇది, నర్సాపూర్ క్రోషెట్ను బ్లౌజ్ భాగంలో అమర్చడంతో స్టైల్‌గా రూపుకట్టింది. వంగపండు రంగు కలంకారి ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. వేసవిలో చమటను పీల్చుకునే ఈ ఫ్యాబ్రిక్ పిల్లలకు అత్యంత సౌకర్యంగా ఉంటుంది. నారింజ రంగు ఇన్నర్ టాప్‌పై బూడిద రంగు ఓవర్‌కోట్ స్కర్ట్ చిన్నారులకు బాగా నప్పుతుంది. ఖాదీ ఫ్యాబ్రిక్ సహజసిద్ధమైనది కనుక పిల్లల లేత చర్మానికి హాయినిస్తుంది. లేత అకుపచ్చ రంగు టై అండ్ డై ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ ఫ్రాక్ ఇది. ఫ్రాక్‌కు బాటమ్‌లో క్రోషెట్తో చిన్న పాకెట్‌ను అమర్చితే డ్రెస్ లుక్ అహ్లాదంగా మారిపోతుంది. కర్టెసి: అరవింద్ జాషువా ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్