110 గ్రామాలు.. ఒకటే గంటల కారు
110 గ్రామాలు.. ఒకటే గంటల కారు
Published Wed, Apr 12 2017 9:44 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
భీమవరం టౌన్ : వేసవి కాలం ఎండలు ముదురుతున్నాయి. ఇది అగ్ని ప్రమాదాల సీజన్ కావడంతో అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న పట్టణాల్లో భీమవరం మూడోస్థానంలో ఉంది. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకూ పరిశీలిస్తే ఇక్కడ 103 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మిగిలిన పట్టణాలకంటే భిన్నమైన పరిస్థితి. అక్టోబర్ నుంచి జనవరి వరకూ అగ్నిప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నట్టు అగ్నిమాపక అధికారులు గుర్తించారు. చలిమంటలు సరిగా ఆర్పకపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ అయిపోతే కుదిపి వెలిగించే ప్రయత్నం చేయడం తదిర అంశాలు ప్రమాదాలకు కారణాలుగా గుర్తించారు. దీనిబట్టి ఏడాది పొడవునా భీమవరంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఒకే ఒక అగ్నిమాపక వాహనం ఉంది.
భీమవరం పట్టణం, మండలం, పాలకోడేరు, వీరవాసరం, ఉండి, కాళ్ల మండలాల పరిధిలో కొన్ని గ్రామాలతో కలిపి మొత్తం 110 గ్రామాలకు ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం సేవలు అందించాల్సి వస్తుంది. గతంలో రెండు అగ్నిమాపక వాహనాలు ఉండేవి. 2016 ఏప్రిల్‌లో ఇక్కడి నుంచి ఒక వాహనాన్ని కుక్కునూరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక అగ్నిమాపక కేంద్రానికి అధికారులు పంపించారు. అప్పటి నుంచి ఇక్కడి కేంద్రానికి మరో వాహనాన్ని కేటాయించ లేదు. దీంతో ఒకే సమయంలో ఎక్కడైనా రెండు ప్రమాదాలు జరిగితే సిబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. సమయానికి గమ్యానికి చేరుకోవడం కష్టసాధ్యం. సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 31 పోస్టులకు గాను 12 ఖాళీగా ఉన్నాయి. అధునాతన యంత్ర సామగ్రి మిస్ట్ బుల్లెట్, మిస్ట్ జీప్, రెస్క్యూబోట్ వంటివి ఉన్నతాధికారులు సమకూర్చినా ఎక్కువ నీటి స్థాయి కలిగిన అగ్నిమాపక వాహనం మరొకటి అవసరం. 1983లో నిర్మించిన రేకుల షెడ్‌లోనే కేంద్రం కొనసాగుతోంది. ఇక్కడి కేంద్రానికి మరో అగ్నిమాపక వాహనాన్ని అధికారులు సమకూర్చి సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
Advertisement
Advertisement