Sun screen
-
ఎండ@36.9 డిగ్రీలు
సిటీబ్యూరో: భానుడి ప్రతాపానికి గ్రేటర్ సిటీజనులు విలవిల్లాడుతున్నారు. మంగళవారం నగరంలో గరిష్టంగా 36.9... కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ, తూర్పు దిశల నుంచి వీస్తున్న వేడిగాలులతో నగర వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో వాహనదారులు,పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. లస్సీ, కొబ్బరి బోండాలు, శీతల పానీయాలతో సేదదీరారు. ఎండలో బయటికి వెళ్లే వారు చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, సన్‌స్క్రీన్ లోషన్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఎండ తీవ్రతకు గురికాకుండా చూడాలని చెబుతున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల్లో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. -
మీకు మీరే బ్యూటీషియన్...
బ్యూటిప్స్ ఇప్పుడిప్పుడే ఎండలు మొదలవుతున్నాయి. బోలెడంత ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఈ పని చేయండి. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి... ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది. కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి.