ఉదయం ఉక్కపోత.. సాయంత్రం చినుకులు
రాష్ట్రంలో వింత వాతావరణం చోటు చేసుకుంటోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సాధారణంగా ఉక్కపోత, చెమట లాంటివి మచ్చుకైనా కనపడని రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా ఇదే పరిస్థితి. పగలు ఎక్కడైనా బయటకు వెళ్లి కాసేపు ఉన్నారంటే చాలు.. విపరీతంగా చెమట పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం అయ్యేసరికి మబ్బులు కమ్మి వర్షం పడుతోంది. స్వల్ప విరామంగా రుతుపవనాలు పొరుగు ప్రాంతాలకు వెళ్లడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి, ఉష్ణోగ్రతల నమోదు, ఉక్కపోత తదితర వివరాలతో కూడిన నివేదికను విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఢిల్లీ పంపించారు. సాధారణంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు నైరుతి సీజన్ ఉంటుంది.
అయితే ఈసారి సెప్టెంబర్ ప్రారంభంలోనే రాష్ట్రం వేడెక్కింది. నైరుతి సీజన్లో 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కాగా.. ప్రస్తుతం ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, తుని, మచిలీపట్నం, విశాఖ తదితర ప్రాంతాల్లో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నాళ్లు 37 డిగ్రీల ఉష్ణోగ్రత తప్పదని అధికారులు చెపుతున్నారు. కోస్తాంధ్రలోని ఉత్తర/దక్షిణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా పగలు ఎండ హడలెత్తిస్తున్నా.. సాయంత్రానికి వర్షం పడుతోంది. మధ్య భారతంలో కూడా తేమ శాతం పెరుగుతున్నందున వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని, క్యూములో నింబస్ మేఘాలూ ఇందుకు సహకరిస్తుండడం వల్లే వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
సెప్టెంబర్ నెలాఖరుకు రుతుపవనాల తిరోగమనం ప్రారంభవుతుందని, అక్టోబర్ మధ్యలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఈ మధ్య కాలంలో ‘క్లియర్ స్కైస్’ (శరత్కాలం) ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి అచ్యుతరావు స్పష్టం చేశారు. ఈ సీజన్లో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయని, వీటినే రుతుపవనాల విరామంగా చెప్పుకోవచ్చని, అయితే ఇది తాత్కాలికమేనని చెప్పారు. కాగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని వల్ల రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.