Sydney museum
-
సచిన్ బొమ్మ తీసేశారు!!
ఆస్ట్రేలియాలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రెండేళ్ల క్రితం పెట్టిన సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఇప్పుడు తీసేశారు. అప్పట్లో బొమ్మ పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి ఆ బొమ్మను చూడటం.. దాని పక్కనే నిలబడి ఫొటోలు తీయించుకుని అచ్చం మాస్టర్ తోనే ఫొటో దిగినట్లు ఫీలయిపోవడం లాంటివి కనిపించేవి. నాటి బొమ్మలో ఐసీసీ టీ20 టోర్నమెంటులో ధరించినట్లు బ్లూ జెర్సీ రూపం ఉండేది. కానీ.. సచిన్ అసలు ఆ మ్యాచ్‌లో ఆడలేదన్న విషయాన్ని మిడ్ డే పత్రిక వాళ్ల దృష్టికి తేవడంతో.. రంగు మారుస్తామని చెప్పారు. అయితే.. శుక్రవారం అక్కడికి వెళ్లి చూసిన పత్రిక ప్రతినిధులు షాకయ్యారు. కొన్ని నెలల క్రితమే అక్కడినుంచి సచిన్ మైనపు బొమ్మను తీసేశారు!! దాన్ని ఇక్కడినుంచి బ్యాంకాక్ పంపామని, ఒకచోటు నుంచి మరో చోటుకు బొమ్మలను పంపడం తమకు సర్వసాధారణమేనని మ్యూజియం సూపర్వైజర్ ఒకరు తెలిపారు. అభిమానులంతా ఎంతో అపురూపంగా చూసుకునే సచిన్ బొమ్మను ఏమాత్రం సమాచారం లేకుండానే తరలించడం ఏంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
అమితాబ్‌కు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సిడ్నీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మను ఈ ఏడాది చేర్చబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజియం వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో కెప్టెన్ కుక్, డాన్ బ్రాడ్‌మన్, నికోల్ కిడ్మన్, హగ్ జాక్మన్, జానీ డెప్, లేడీ గాగాల సరసన అమితాబ్ మైనపు బొమ్మ కూడా చేరబోతోంది. ఈ బొమ్మను ఇంటరాక్టివ్ సెట్టింగ్‌లో పెట్టబోతుండటంతో అభిమానులు దానికి సమీపంగా వెళ్లి స్వయంగా అమితాబ్‌ను కలిసిన అనుభూతిని కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పోల్ నిర్వహించి, ఈసారి టస్సాడ్స్ మ్యూజియంలో ఏ సెలబ్రిటీ బొమ్మ పెట్టాలని అడిగితే, ఎక్కువ మంది అమితాబ్‌నే ఎన్నుకున్నారట. ఈ విషయాన్ని మ్యూజియం జనరల్ మేనేజర్ క్విన్ క్లార్క్ ప్రకటించారు. ఇప్పటికే జీవితకాల సాఫల్యాన్ని సాధించిన అమితాబ్ బచ్చన్ విగ్రహం పెట్టడం మ్యూజియానికే గౌరవం అన్నారు.