Syed Alishah Geelani
-
నా చావు తర్వాతే వారసుడి ప్రకటన
తన చావు తర్వాతే తన వారసుడి పేరు బయటకు వస్తుందని జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ స్పష్టం చేశారు. వారసుడి పేరు తాను ప్రకటిస్తానంటూ వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. తన వారసుడి పేరును తెహరీక్ ఎ హురియత్ నేతలు తన చావు తర్వాతే ప్రకటిస్తారని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం హురియత్ కాన్ఫరెన్సు డిప్యూటీ చైర్మన్గా ఉన్న అష్రఫ్ సెహ్రాయ్ పేరును గిలానీ వారసుడిగా ప్రకటిస్తారని ఇంతకుముందు వినిపించింది. సయ్యద్ అలీషా గిలానీ (86) సుమారు 1990 నుంచి హురియత్ కాన్ఫరెన్సులో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. అప్పుడే జమ్ము కశ్మీర్లో వేర్పాటువాదం పెచ్చరిల్లింది. 2003 నుంచి హురియత్ చీలికవర్గానికి ఆయన నేతగా ఉన్నారు. మూడుసార్లు శాసనసభకు కూడా ఎన్నికైన గిలానీ.. 2006లో జైల్లో ఉండగా మూత్రపిండాల కేన్సర్ బారిన పడ్డారు. ఈ సంవత్సరం మార్చి నెలలో ఆయనకు కొద్దిగా గుండెపోటు కూడా వచ్చింది. 2008 నుంచి ఆయన చాలా కాలం పాటు శ్రీనగర్లో గృహనిర్బంధంలోనే ఉన్నారు. -
ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ
శ్రీనగర్: వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ ఎట్టకేలకు తాను భారతీయుడినని ఒప్పుకున్నారు. పాస్పోర్టుకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయన శుక్రవారం పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పాస్పోర్టు దరఖాస్తుపత్రంలో తాను భారతీయుడినని రాశారు. వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు అందజేశారు. ఈ హురియత్ నేత అస్వస్థతతో ఉన్న తన కుమార్తెను చూసేందుకు సౌదీఅరేబియా వెళ్లదలుచుకున్నారు. గిలానీ పాస్పోర్టు కార్యాలయం వెలుపల విలేకరులడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తాను పుట్టుకతో భారతీయుడ్ని కాదని, కానీ తప్పడం లేదని, బలవంతంగా అయ్యానని అన్నారు. గిలానీ జాతీయత కాలమ్లో భారతీయుడినని రాయడాన్ని ఓ హురియత్ ప్రతినిధి సమర్థించారు.