కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నూతనంగా ప్రారంభించిన కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు విక్రయిస్తే లెసైన్స్ రద్దు చేయడంతో పాటు సదరు దుకాణాలను మూసివేస్తామని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు హెచ్చరించారు. దసరా సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ బోయిగూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు విక్రయాలను మంత్రి గౌడ సంఘం ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కల్తీ కల్లు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తుందన్నారు. నాణ్యమైన కల్లును మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు.
కుల వృత్తులను కాపాడి గౌడ కులస్తులకు ఆర్థికంగా చేయూత నివ్వడంతో పాటు ఉపాధి కల్పించడానికి కల్లు కాంపౌండ్లను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ పేర్కొన్న వి ధంగా నగరంలో కల్లు కాంపౌండ్లను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెరిపించామని గుర్తు చేశారు. కల్లు కాంపౌండ్ల వల్ల సుమారు 50 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. నగరంలో కల్లు ఉత్పత్తి లేనందున నాణ్యమైన కల్లు ఎక్కడ నుంచి వస్తుందనే వాదనలో పస లేదని మంత్రి అన్నారు. ఇతర జిల్లాల్లో చెట్ల ద్వారా కల్లు ఎంతో ఉత్పత్తి అవుతోందని, నగరంలోని సొసైటీలకు సదరు చెట్ల ద్వారా కల్లు సరఫరా చేస్తామన్నారు.
ఉదారతను చాటుకున్న మంత్రి
కరీంనగర్ జిల్లాకు చెందిన పేద దళిత కుటుంబం పట్ల ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు ఉదారతను చాటుకున్నారు. ఈనెల 2న బతుకమ్మ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఎల్ల చిరంజీవి, సమ్మక్క దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వచ్చారు. అక్కడ వారు మంత్రిని కలిసి తమ దుర్భర పరిస్థితిని చెప్పుకున్నారు. వెంటనే సదరు కుటుంబాన్ని మంత్రి తన ఇంటికి తీసుకువచ్చి రెండు రోజుల పాటు ఇంట్లో ఆతిథ్యమిచ్చారు. అనంతరం చిరంజీవి, సమ్మక్క కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి శనివారం వారి స్వగ్రామం పంపించారు. అన్ని విధాలా వారికి అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు.