Takata
-
బీఎండబ్ల్యూ కారు ఎయిర్ బ్యాగ్ పేలుడు కలకలం
టకాటా ఫాల్టీ ఎయిర్‌బ్యాగ్ మరోసారి తీవ్ర ప్రమాదానికి దారి తీసింది. బీఎండబ్ల్యూ కారులో ఎయిర్ బ్యాగ్ అకస్మాత్తుగా పేలడంతో కారు యజమానురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన కలకలం రేపుతోంది. జూన్ 18న ఈ పేలుడు సంభవించింది. సంస్థ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్ పేలుడుతో అడిలైడ్‌కు చెందిన జార్జియా బెక్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్‌కు చెందిన ఎయిర్‌బ్యాగ్ ఒక్కసారిగా పేలి కారు స్టీరింగ్ నుండి, విండి స్క్రీన్‌లోంచి పై కప్పుకు ఎగిసింది. దీంతో జార్జియా గడ్డంకింద, చేతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల సంస్థ చేపట్టినభారీ రీకాల్‌లో భాగంగా ప్యాసింజెర్ వైపు ఎయిర్‌బ్యాగ్‌ను రీప్లేస్ చేసినట్టు ఆమె తెలిపారు. అయితే డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగును పెద్దగా పట్టించుకోలేదు. అదే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినపుడు నల్లటి పొగ అలుముకుందని, గన్ పౌడర్ వాసన వచ్చిందంటూ భయంకరమైన తన అనుభవాన్ని జార్జియా బెక్ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన బీఎండబ్ల్యూఅంతర్జాతీయ దర్యాప్తునకు ఆదేశించింది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎయిర్‌బ్యాగ్‌ను జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి పంపింది. అయితే 2009 లో ప్రమాదానికి గురైన ఈ కారును పాత యజమాని ఆ విషయాన్ని దాచిపెట్టి , జార్జియాకు విక్రయించినట్టుగా సంస్థ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా టకాటా ఎయిర్ బ్యాగు లోపాల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించడంతో హోండా, బీఎండబ్ల్యూ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే లక్షలాది కార్లను రీకాల్ చేశాయి. కానీ, ప్రాణాంతకమైన ఎయిర్‌బ్యాగ్‌లతో 7లక్షల కార్లు ఇప్పటికీ రోడ్లపై ఉన్నట్టు తెలుస్తోంది. -
29లక్షల టయోటా కార్లు రీకాల్
టోక్యో: టయోటా మోటార్ కార్పొరేషన్ భారీ మొత్తంలో కార్లను రీకాల్ చేస్తోంది. చైనా, జపాన్ ఓషియానియా, ఇతర ప్రాంతాలలో మొత్తం 29 లక్షల వాహనాలను రీకాల్ చేయనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్స్ లోని లోపాల కారణంతో తమ కోరోల్లా యాక్సియో సెడాన్, ఆర్ఏవీ4 ఎస్యూవీ క్రాస్ ఓవర్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోనున్నట్టు తెలిపింది. ఎయిర్ బ్యాగ్స్ లోని లోపంతో అంతకముందు కూడా భారీ మొత్తంలో కార్ల రీకాల్ ను టయోటా చేపట్టింది. ఫుజి హెవీ ఇండస్ట్రీస్, మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్, ట్రక్ తయారీదారి హినో మోటార్స్ కూడా 2,40,000వేల వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించాయి. జపాన్ ఎయిర్ బ్యాగ్ ల సంస్థ టకటా లోపాల కారణంగా ఆటో ఇండస్ట్రీస్ లో భారీ ప్రమాదాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ ప్రమాదాలు ఎక్కువగా వాటిల్లుతున్నాయి. టకటా బ్యాగుల లోపంతో ఎన్నడూ లేనంతగా ఆటో ఇండస్ట్రీలో రీకాల్ ప్రాసెస్ నడుస్తోంది. ఓషియానియా, మధ్య ప్రాశ్చ, ఇతర చిన్న మార్కెట్లలో అమ్మిన 1.16 మిలియన్ వెహికిల్స్ కు టయోటా ఇప్పటికే రీకాల్ నోటీసు పంపింది. అంతేకాక, జపాన్ లో 7,50,000 వాహనాలను రీకాల్ చేసింది. టయోటాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న నార్త్ అమెరికా ఈ తాజా రీకాల్ నుంచి తప్పించుకుంది. ఓ వైపు నుంచి రీకాల్స్ కు సంబంధించిన ఖర్చులను భరించడానికి తమకు ఎవరైనా సాయం చేయాలంటూ టకాటా కోరుతోంది.