Tamil Nadu farmers
-
స్టాలిన్ భారీ ర్యాలీ
తమిళనాడు : కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు కోసం తమిళపార్టీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నిన్నటివరకూ కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ.. తమిళనాడు ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంతో పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడటంతో రాష్ట్ర వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు కోరుతూ... డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే స్టాలిన్ శనివారం ముక్కుంబులో భారీ ర్యాలీను ప్రారంభించారు. కావేరీ డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. స్టాలిన్ ప్రారంభించిన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ముత్తారాసన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌తో పాటు డీఎంకే కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ఓ వైపు నుంచి స్టాలిన్ ఈ ర్యాలీని ప్రారంభించగా, మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా ఆయాలూరు నుంచి మరో ర్యాలీని ప్రారంభించారు. ఈ రెండు ర్యాలీలు ఏప్రీల్ 13న కడలూరులో డీఎంకే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కలువనున్నాయి. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయని స్టాలిన్ విమర్శించారు. -
ప్రధాని కార్యాలయం ఎదుట నగ్నంగా ఆందోళన!
వినూత్న ఆందోళనలతో హోరెత్తిస్తున్న తమిళ రైతులు న్యూఢిల్లీ: తమ గోడును కేంద్రానికి వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. తాజాగా రైతులు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. పీఎంవో సహా కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సౌత్‌బ్లాక్ ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు నెలరోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.