అడవి దొంగలు...!
భద్రాచలం : తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అడవుల్లో దొంగలు పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓ వైపున అటవీశాఖాధికారులు పంపకాల పనిలో నిమగ్నమై ఉండగా, ఇదే అదనుగా భావించిన స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. టేకు, జిట్రేగు వంటి విలువైన చెట్లకు నిలయమైన భద్రాచలం ఏజెన్సీలో ప్రస్తుతం అవి చూద్దామన్నా కనిపించడం లేదు.
అటవీశాఖాధికారులు అడపా, దడపా చేసిన దాడుల్లో పెద్ద ఎత్తున కలప పట్టుబడుతోందంటే.. ఇక్కడ ఏ తీరున స్మగ్లింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. భద్రాచలం డివిజన్లోని నార్త్, సౌత్ విభాగాల పరిధిలో ప్రతి ఏటా రూ. కోట్ల విలువైన కలపను స్మగ్లర్లు తరలించుకుపోతున్నారు. వారికి కొంతమంది అటవీశాఖాధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు అడపా దడపా దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నా.. వారికి పట్టుబడకుండా తరలిస్తున్నది అంతకు రెట్టింపు స్థాయిలోనే ఉంటుందని అంచనా.
చింతూరు మండలం మోతుగూడెం, కాటుకపల్లి, భద్రాచలం బ్రిడ్జి సెంటర్, పాల్వంచ సమీపంలో పలు చోట్ల అటవీశాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. లంచాలకు అలవాటు పడిన కొంతమంది సిబ్బంది కారణంగా అక్రమ కలప రవాణను అడ్డుకోలేకపోతున్నారనే విమర్శ ఉంది. చెక్ పోస్టులలో వసూళ్లు మామూలేనని, కార్యాలయాల నిర్వహణ కోసం ఆ మాత్రం చేయకుంటే తప్పదని కొందరు రేంజ్ అధికారులే చెబుతుండటం వారి పనితీరుకు నిదర్శనం.
స్మగ్లర్ల దాడులకు సాక్ష్యాలివే..
గత రెండేళ్లుగా భద్రాచలం ఏజెన్సీలోని అటవీ సంపదను స్మగ్లర్లు పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారడానికి పట్టుబడిన కలప నిల్వలే సాక్ష్యం గా నిలుస్తున్నాయి. భద్రాచలం నార్త్ డివిజన్లో 2012-13, 2013-14 సంవత్సరంలో మొత్తం 824 కేసులు నమోదు చేసి రూ.1,05,48,959 విలువైన కలపను పట్టుకున్నారు. సౌత్ డివిజన్లోగత రెండేళ్ల కాలంలో 592 కేసులు నమోదు చేసి రూ.1,23,94,925 విలువ గల కలపను స్వాధీనం చేసుకున్నారు. ఇక పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లతో కలుపుకుంటే ఎంత అటవీ సంపద స్మగ్లర్ల పాలవుతుందో ఊహించుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది.
రాచమార్గంలోనే రవాణా...
తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన ఉన్నంతలో వెనుకేసుకుందామనే ఆలోచనతో ఉన్న కొంతమంది అటవీ అధికారులు, సిబ్బంది కారణంగా అక్రమార్కులు కలపను రాచమార్గంలోనే తరలించుకుపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించగా, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు సర్దుబాటు చే సేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రధానంగా పోలీసులందరినీ అక్కడ నుంచి వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని సాకుగా తీసుకున్న కొంతమంది పోలీసు అధికారులు అక్రమ కలప రవాణాకు తెరలేపారు.
గత నాలుగు రోజుల క్రితం టాటా మాజిక్ ఆటోలో కలప రవాణా చేస్తుండగా భద్రాచలం వద్ద అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. ఆ కలప చింతూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారిదిగా ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఆ కోణంలో విచారణ లేకపోగా, అటవీశాఖాధికారులు కలప దొరికితే చాలన్న రీతిలో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న కొంతమంది పోలీసు శాఖ అధికారులు కూడా అక్రమ కలప రవాణాలో భాగస్వాములవుతుండటం గమనార్హం.