గులాబీ నేతల దూకుడు.. సుడిగాలి పర్యటనలలో మంత్రులు
కామారెడ్డి: ఎన్నికల షెడ్యూల్ రాకముందే అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తున్నారు. పనిలో పనిగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేలకు పార్టీ కీలక నేతలైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తోడయ్యారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, మరో ముఖ్య నాయకుడు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావులు అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోనూ ఇరువురు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
బాన్సువాడ పట్టణంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రాకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కామారెడ్డిలో కేటీఆర్ సభ
మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం కామారెడ్డిలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పది వేల మందితో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక్కడినుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీకి మరింత ఊపు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.