మూడ్రోజుల ముందే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగింపు
తర్వాతే టెరా సాఫ్ట్‌వేర్‌కు నజరానా.. ‘సాక్షి’కి ఇన్‌క్యాప్ వివరణ
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌లిస్టులో ఉన్న ‘టెరా సాఫ్ట్వేర్’ కంపెనీకి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కట్టబెట్టారంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనంలో వాస్తవం లేదని, బిడ్స్ దాఖలు చేయడానికి ఉన్న గడువుకు సరిగ్గా మూడు రోజలు ముందే ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తప్పించినట్లు ఇన్కాప్యప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వివరణ ఇచ్చింది. ‘బిడ్స్ దాఖలు చేయడానికి ఈ ఏడాది ఆగస్టు 7 ఆఖరు తేదీ. 2015 మేలో టెరాను బ్లాక్‌లిస్టులో పెడుతూ పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత పరిస్థితిని సమీక్షించిన పౌర సరఫరాల శాఖ.. టెరాను బ్లాక్‌లిస్టు నుంచి తొలగిస్తూ ఆగస్టు 4న (బిడ్స్ దాఖలు చేయడానికి సరిగ్గా 3 రోజుల ముందు) నిర్ణయం తీసుకుంది.
అదే రోజు పౌర సరఫరాల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా టెరాను బ్లాక్‌లిస్ట్ నుంచి ‘ఏపీటీఎస్’ తొలగించింది. బ్లాక్‌లిస్ట్ నుంచి బయటపడటంతో.. ఆగస్టు 7న ‘టెరా’ బిడ్స్ దాఖలు చేసింది’ అని వివరణలో పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించింది కూడా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్ ఎలా ఇస్తారనే. అయితే ఇందుకు వివరణగా టెండర్ దాఖలుకు మూడ్రోజుల ముందు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించినట్లు పేర్కొనడం చూస్తుంటే సాక్షి కథనం వాస్తవమేనని స్పష్టమవుతోంది. అలాగే టెండర్ మదింపు కమిటీలో వి.హరికృష్ణప్రసాద్‌ను ఎలా నియమిస్తారని ‘సాక్షి’ ప్రశ్నించగా ఈ-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా, టెండర్ మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించినట్లు వివరణలో పేర్కొన్నారు.