తహసీల్దార్ వేధింపులు భరించలేకపోతున్నాం
కూసుమంచి,ఖమ్మం : తహసీల్దార్ కృష్ణ వేధింపులను భరించలేకపోతున్నామని గురువారం మండలంలోని వీఆర్ఓలు, వీఆర్ఏలు సామూహికంగా విధులను బహిష్కరించారు. అనంతరం ఖమ్మం వెళ్లి ఆర్డీఓ పూర్ణచంద్రకు వినతిపత్రం రూపంలో తమ గోడును చెప్పుకున్నారు. తహసీల్దార్ తీరు మారేంత వరకు తాము విధులకు రాబోమని తేల్చి చెప్పారు. తొలుత వీరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఓల సంఘం మండల అధ్యక్షుడు షేక్ నాగులుమీరా విలేకరులతో మాట్లాడుతూ.. కూసుమంచి తహసీల్దార్ కృష్ణ వీఆర్ఓలు, వీఆర్ఓలను తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. తమకు జీతాలు కూడా సక్రమంగా అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. పని ఉన్నా లేకున్నా అర్థరాత్రి వరకు ఆఫీసులోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సిబ్బంది పట్ల తహసీల్దార్ ప్రవర్తన ఏమాత్రం బాగాలేదన్నారు. గతంలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం సమయంలో తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు రేయింబవళ్లు కష్డపడి పనిచేశామని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేకున్నా రాత్రి వరకు ఆఫీసులోనే ఉంచుతున్నారని వాపోయారు. ఉదయం 8 గంటలకు ఆఫీసుకు వచ్చి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళతామని విన్నవించుకున్నా ససేమిరా అంటున్నారన్నారు. ఉదయం 6 గంటలకే కార్యాలయానికి వచ్చి రాత్రి 10 వరకు ఉండాలని ఆదేశిస్తున్నారని చెప్పారు. అనంతరం వీఆర్ఓల ఆందోళనకు మద్దతు తెలిపిన సంఘం రాష్ట్ర నాయకుడు గరికె ఉపేందర్‌రావు మాట్లాడుతూ.. తహసీల్దారు తీరును తప్పుబట్టారు. తమకు కూడా ఇతర ఉద్యోగుల వలె అన్ని హక్కులూ ఉంటాయన్నారు. ప్రభుత్వ పాలనలో తామే కీలకం కాబట్టి కొన్ని సమాయా ల్లో అదనంగా పనిచేయాల్సి వస్తోందన్నారు. దా న్ని అడ్డుపెట్టుకుని తహసీల్దారు కావాలని పనివత్తిడి పెంచి వీఆర్ఓలను, వీఆర్ఏలను మానసికం గా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. తహసీల్దారు తీరుపై ఉన్నతాధికారులకు విన్నవిస్తామని అన్నారు. తీరు మార్చుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.