హూహూహూ... హోటల్
అతి అన్ని వేళలా పనికి రాదు అని పెద్దలు అంటారు కాని అతి ఉంటే తప్ప వినోదం లేదని సదరు హోటల్ వారు తేల్చారు. స్వీడన్‌లోని జుక్కాస్జార్వీ అనే ప్రాంతంలో ఉన్న ఈ మంచు హోటల్లో అన్నీ అతిగానే ఉంటాయి. మంచు గది, మంచు మంచం, మంచు గ్లాసు, మంచు డైనింగ్ టేబుల్.... ఇంత తీవ్రమైన మంచు హోటల్లో విడిది చేస్తే ఆ మజాయే వేరు అంటున్నారు హిమ ప్రేమిక పర్యాటకులు. అందుకే ప్రతి చలికాలంలో ఈ హోటల్‌కు విపరీతమైన గిరాకీ. ఉన్న 20 గదులు చకచకా బుక్ అయిపోతాయి.
చలికాలంలో ఈ ప్రాంతంలో పారే థోర్న్ నది దాదాపు గడ్డ కడుతుంది. ఆ ఐస్‌ముక్కలను అచ్చులలో పోసి అచ్చులను తొలగిస్తూ హోటల్‌ను నిర్మిస్తారు. ఇంతకు ముందు వరకు ఈ హోటల్‌ను ప్రతి ఏడాదీ మళ్లీ మళ్లీ కట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే వేసవి ఎండలకు మంచు కరిగి నీరైపోక తప్పదు కదా. అయితే పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోటల్లో కొంతభాగమైనా ఏడాది పొడవునా పర్యాటకులకు అందుబాటులో ఉండేలా తాజా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సోలార్ ప్యానెల్స్‌తో ఉత్పత్తి చేసిన విద్యుత్తుతో ఐస్ అచ్చులు కరగకుండా చూస్తున్నారు.
అంతేకాదు... సోలార్ ప్యానెల్స్ కారణంగా పర్యాటకులు తమ మంచుగదుల్లో నిప్పుల కుంపటి పెట్టుకుని వెచ్చగా ఉండే ఏర్పాటు కూడా చేస్తున్నారు. వేసవి ముగిసిన వెంటనే యథావిధిగా కొత్త డిజైన్లతో గదులు, ఒక ఐస్బార్ వంటి వాటితో పూర్తి హోటల్ నిర్మాణమవుతుంది. చన్నీటి స్నానానికే భయపడిపోయేవారు ఈ హోటల్లో విడిది చేస్తే ఏమంటారు? ఇంకేమంటారు.... హూహూహూ... హాహాహా... పళ్లు టకటక.