పరీక్షల్లో కాపీకొడుతూ దొరికేసిన ఐజీ
ఆయనో సీనియర్ పోలీసు అధికారి. ఆయనకు మాస్టర్ ఆఫ్ లా చదవాలని అనిపించింది. అయితే, పరీక్షలకు కష్టపడి చదివి.. రాసే ఓపిక, తీరిక రెండూ లేవు. అందుకే కాపీ కొట్టాలనుకున్నారు. కానీ, పరీక్ష హాల్లో దొరికిపోయారు. దాంతో ఆయనను బయటకు పంపేశారు. కేరళలోని త్రిసూర్ రేంజి ఐజీ టీజే జోస్ సెయింట్ పాల్స్ కాలేజిలో కాన్స్టిట్యూషనల్ లా పేపర్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్నారు. అంటే, ఆయన అంతకుముందు రాసిన పరీక్షలో ఫెయిలయ్యారన్న మాట. దూరవిద్య పద్ధతిలో ఎల్ఎల్ఎం చదువుతున్న ఆయన.. ఉదయం 10 గంటలకు పరీక్షకు హాజరయ్యారు. కానీ 11.30 ప్రాంతంలో ఆయన ఆన్సర్ షీట్ల మధ్యలో చీటీ పెట్టుకుని కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టేసుకున్నారు. వెంటనే ఇన్విజిలేటర్ ఆయనను బయటకు పంపి, కాలేజి మేనేజర్‌కు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌కు చెప్పారని.. తాము ఈ విషయాన్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కూడా తెలియజేశామని కాలేజి వైస్ ప్రిన్సిపాల్ పీటర్ తెలిపారు.
అయితే ఐజీ మాత్రం తాను కాపీ కొట్టానన్న విషయాన్ని అంగీకరించలేదు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, తాను రాయడం 12 గంటలకే అయిపోయిందని, అందుకే బయటకు వచ్చేశానని, కాపీ ప్రసక్తిగానీ, తన వద్ద నుంచి పేపర్లు లాక్కోవడం గానీ జరగనేలేదని ఆయన అన్నారు. మంగళవారం నాడు జరిగే పరీక్షకు కూడా హాజరవుతానని ధీమాగా చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా తనను వివరణ కోరగా ఇదే విషయం చెప్పానన్నారు.