సద్దాం హుస్సేన్ సమాధిలో లేడా!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు, సైన్యానికి జరుగుతున్న పోరుతో ఇరాక్ అట్టుడికిపోతోంది. ఐఎస్ ఆక్రమిత టిక్రిట్ నగరంపై పట్టు సాధించేందుకు సైన్యం జరిపిన బాంబు దాడుల్లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసమైంది. 2006లో ఉరితీత తర్వాత సద్దాం పార్థివదేహాన్ని ఆయన సొంత గ్రామం.. టిక్రిట్ నగరానికి దక్షిన ప్రాంతంలోఉన్న అల్ ఔజా గ్రామంలో ఖననం చేశారు. అనంతరం దానిని ఓ అద్భుత కట్టడంలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇది పూర్తిగా నేలమట్టమైంది.
అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన వీడియో ఫుటేజిలో ఔజా గ్రామంలోని సద్దాం సమాధి ఫిల్లర్లు నేలకూలిన దృశ్యాలు పొందుపర్చారు. 48 గంటల్లో టిక్రిట్ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో నగరం రెండువైపుల నుంచి ఆదివారం ఇరాకీ సైన్యం చేసిన దాడులవల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. కాగా సమాధి విధ్వంసం గత ఆగస్టులోనే జరిగిందని ఐఎస్ వాదిస్తోంది. ఈ వాదనలను సైన్యం తోసిపుచ్చింది. అయితే ఇలాంటి ఉపద్రవాన్ని ముందే ఊహించి టిక్రిట్లోని సమాధి నుంచి సద్దాం దేహాన్ని వేరొక ప్రాంతానికి తరలించినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన దేహం ఎక్కడన్నదనే విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయనే సాకుతో ఇరాక్‌పై యుద్దం చేసిన ఆమెరికా.. 2003లో సద్దాం హుస్సేన్‌ను బందీగా పట్టుకుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు, కుర్దులను హత్యచేశారని ఆరోపిస్తూ ఇరాకీ ట్రిబ్యూనల్ 2006లో సద్దాంకు ఉరిశిక్షను ఖరారుచేసి, అమలుచేసింది. 2007 లో టిక్రిట్ పట్టణ శివార్లలోని ఓజా గ్రామంలోని సమాధిలో ఆయన దేహాన్ని ఖననం చేశారు.