58 లక్షల టయోటా కార్ల రీకాల్!
కార్లను రీకాల్ చేస్తున్న కంపెనీల జాబితాలోకి టయోటా కూడా చేరింది. జపాన్, యూరప్, చైనాలతో పాటు భారతదేశంలో ఉన్నవాటితో కలిపి మొత్తం 58 లక్షల కార్లను రీకాల్ చేయాలని టయోటా నిర్ణయించింది. వీటన్నింటిలో ఉపయోగించిన టకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్లలో లోపం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ కారు ప్రమాదానికి గురై ఒక వ్యక్తి గాయపడినట్లు తెలిసిందని కంపెనీ చెప్పింది. కానీ, ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయం చెప్పలేకపోతున్నారు. ఎయిర్ బ్యాగ్ చిరిగిపోవడం వల్లే ఇలా జరిగిందా అనే విషయాన్ని టయోటా పరిశీలిస్తోంది.
అమెరికాలో ఇలాగే ఎయిర్‌బ్యాగ్‌లు బాగోని కార్లను రీకాల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2.31 కోట్ల కార్లను రీకాల్ చేసి, వాటిలో ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థను బాగుచేయనున్నట్లు టయోటా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టకాటా ఎయిర్‌బ్యాగ్‌లు బాగోని కార్ల ప్రమాదాల్లో 16 మంది మరణించారు. 17 కార్ల కంపెనీలు అమెరికాలోనే 6.9 కోట్ల కార్లను, ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల కార్లను రీకాల్ చేశారు. తాజాగా హిలక్స్ పికప్, కరొల్లా, ఎటియోస్, యారిస్ కార్లను ఇలా రీకాల్ చేశారు. కరొల్లా, కరొల్లా రన్ఎక్స్, కరొల్లా యాక్సియో, కరొల్లా ఫీల్డర్, కరొల్లా ఎక్స్, బెల్టా.. ఇలా పలు రకాల మోడళ్లలో ఎయిర్ బ్యాగ్ లోపాలున్నట్లు తేలింది. టకాటా ఎయిర్‌బ్యాగ్‌లు ఎక్కువగా ఉపయోగించే కార్ల కంపెనీలలో హోండా, టయోటా, ఫియట్ క్రిస్లర్ తదితరాలున్నాయి. టకాటా ఎయిర్‌బ్యాగ్‌లలో లోపాల కారణంగా వాటిని వాడటం మానేశామని చాలావరకు కార్ల కంపెనీలు చెబుతున్నాయి. రీకాల్ ఖర్చులన్నీ తడిసి మోపెడు కావడంతో టకాటా కంపెనీ దివాలా తీసే ప్రమాదం ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు.