ఏడాదైనా ఎదురుచూపులే..
సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తప్పించేందుకు, గ్రామాభివృద్ధికి తోడ్పడేందుకు ఏకగ్రీవంగా పాలకమండలిని ఎన్నుకున్న గ్రామపంచాయతీలకు ప్రోత్సాహం విషయంలో ఏడాదైనా ఎదురుచూపే మిగిలింది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇంకా అందనేలేదు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుండగా.. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయినా.. వీటికి ప్రోత్సాహం ఇవ్వలేదు.
ఏకగ్రీవానికి ప్రోత్సాహం
ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.ఐదు లక్షలు అందించేది. తాజా
పాలకమండలి ఆ మొత్తాన్ని ఏడు లక్షలకు పెంచింది. ఆ నిధులతో గ్రామం అభివృద్ధికి ఉపయోగపడే శాశ్వత భవనా ల నిర్మాణం, పాఠశాల, అంగన్వాడీ భవనాలు, రహదారి వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. దీంతో ఆయా గ్రామాల్లోని పార్టీలు, నాయకులు, ప్రజలు ఏకమై జిల్లాలో 70 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవానికి సై అన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఊరించి ఉసురుమనిపించిన చందంగా.. ఈ పంచాయతీలకు ఇప్పటివరకు ప్రోత్సాహం అందలేదు. 70 పంచాయతీలకు గాను ఒక్కో పంచాయతీకి రూ.7 లక్షల చొప్పున రావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు కూడా ప్రతిపాదనలు పంపిం చారు. అయితే.. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం నేపథ్యంలో ఆ సొమ్ము ఇంకా అందనేలేదు.
రెండేళ్లు అధికారుల పాల నలో అభివృద్ధికి దూరంగా ఉన్న పంచాయతీలు.. ఏకగ్రీవ నిధులు వస్తే ప్రగతి బాటలో నడిపించుకోవచ్చనే ఆలోచన తో అక్కడి మండళ్లు ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని ఆ యా పాలకులు కోరుతున్నారు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంపైనే ఆ సర్పంచ్లు ఆశలు పెట్టుకున్నారు.
మంత్రికి విన్నవించాం..
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్కు విన్నవించాం. తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మరోమారు ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేస్తాం. - సౌధాని భూమన్న యాదవ్, తెలంగాణ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు