Under-17 FIFA World Cup Football
-
ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన టీమిండియా
అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్-2022లో భారత చాప్టర్ క్లోజ్ అయ్యింది. టోర్నీ మొత్తంలో భారత అమ్మాయిలు ఒక్క గోల్ కూడా కొట్టకుండా నిష్క్రమించారు. ఆడిన మూడు మ్యాచ్ల్లో కనీస పోరాటం కూడా చేయకుండా ప్రత్యర్ధులకు దాసోహమయ్యారు. తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో 0-8 తేడాతో ఓటమిపాలైన భారత అమ్మాయిలు, ఆతర్వాత మొరాకో చేతిలో 0-3 తేడాతో.. చివరి మ్యాచ్లో బ్రెజిల్ చేతిలో 0-5 తేడాతో చిత్తయ్యారు. ఆతిధ్య జట్టు హోదాలో మెగా టోర్నీకి అర్హత సాధించిన భారత కనీస పోటీ కూడా ఇవ్వకుండా, పేలవ ప్రదర్శనతో నిష్క్రమించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. టోర్నీలో ప్రస్తుత పరిస్ధితి విషయానికొస్తే.. గ్రూప్-ఏలో ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడిన భారత్ ఆఖరి స్థానంలో నిలువగా.. అమెరికా అగ్రస్థానంలో, బ్రెజిల్, మొరాకో జట్లు 2,3 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొనగా.. చెరి నాలుగు జట్లు నాలుగు గ్రూప్లుగా విభజించబడ్డాయి. గ్రూప్-బి నుంచి జర్మనీ, నైజీరియా.. గ్రూప్-సి నుంచి కొలొంబియా, స్పెయిన్.. గ్రూప్-డి నుంచి జపాన్, టాంజానియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అన్ని గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
ఫిఫా అండర్-17 వరల్డ్ కప్.. లీగ్ దశలోనే భారత్ అవుట్
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్బాల్ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో 0–8తో ఓడిన భారత్... శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో 0–3తో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. మొరాకో తరఫున దోహా ఎల్ మదానీ (51వ ని.లో), యాస్మీన్ జౌహర్ (62వ ని.లో), జెనా షరీఫ్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్ ఈనెల 17న జరిగే నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్లో బ్రెజిల్తో ఆడుతుంది. బ్రెజిల్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతం బ్రెజిల్, అమెరికా నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో... మూడు పాయింట్లతో మొరాకో రెండో స్థానంలో ఉంది. -
రూ.48కే అండర్–17 ఫుట్బాల్ ప్రపంచకప్ టికెట్
కోల్కతా: భారత్లో జరిగే అండర్–17 ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీల టికెట్ ధరలను ప్రకటించారు. ప్రేక్షకుల ఆదరణను పెంచేందుకు తొలి అంచె మ్యాచ్ టికెట్లను కనిష్టంగా కేవలం రూ.48కే అందించనున్నారు. మంగళవారం రాత్రి 7.11 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టోర్నీ డైరెక్టర్ జేవియర్ కెప్పి తెలిపారు. ఇతర స్టాండ్స్ టికెట్ ధరలు రూ.96, రూ.192గా ఉన్నాయి. అక్టోబర్ 6 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీ ఫైనల్కు కోల్కతా వేదికగా నిలుస్తుంది. కోల్కతాలో జరిగే పది మ్యాచ్లకు కలిపి రూ.480తో ప్యాకేజీగా అందిస్తామని... ఇందులో ఫైనల్ మ్యాచ్ టికెట్ కూడా ఉంటుందని కెప్పి తెలిపారు.