ఆ నగరం కింద.. లక్షలాది బాంబులు!
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరం మొత్తం ఇప్పుడు పేలిపోయేందుకు సిద్ధంగా ఉంది. 1999 నాటి కార్గిల్ యుద్ధం సమయంలో పేలని, తిరస్కరించిన వేలాది బాంబులను అక్కడున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా (ఓఎఫ్కే)లో భూగర్భంలో పాతిపెట్టారు. అదంతా భారీగా జన సమ్మర్ధం ఉండే ప్రాంతం. అవి పేలితే అక్కడ భూకంపం సంభవించి, నగరవాసులకు భారీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వరుసపెట్టి పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కూడా చిన్నపాటి పేలుడు సంభవించి, ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు.
ఓఎఫ్కే ప్రాంతంలో లక్షకు పైగా 84 ఎంఎం మోర్టార్లు, ఎల్70, బీఎంపీ2 షెల్స్ ఉన్నాయని అంచనా. కార్గిల్ యుద్ధం నాటి పేలుడు పదార్థాలను దాచి ఉంచిన మ్యాగజైన్ ఎఫ్12 అనే ప్రాంతం అయితే మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. తాము ఈ అంశాన్ని పలుసందర్భాల్లో అధికారుల దృష్టికి తెచ్చామని, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడి బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు.. ఏ దేశంతోనైనా యుద్ధం చేయడానికి సరిపడగా ఉన్నాయని జాయింట్ కన్సల్టేషన్ మిషనరీ సభ్యుడు అరుణ్ దూబే తెలిపారు.
ఇవి మాత్రమే కాదు.. రష్యన్ ఆయుధాల ఎగుమతి సంస్థ మెసర్స్ 'రోసోబోరోన్ ఎక్స్పోర్ట్' 2013లో సరఫరా చేసిన దాదాపు 4వేల కిలోల ఆర్డీఎక్స్ కూడా జబల్పూర్ నగరం కిందే నిక్షిప్తమై ఉంది. నాణ్యతా పరీక్షలలో ఇది విఫలం కావడంతో దాన్ని ఉపయోగించలేదని, 2014లో పాత ఆర్డీఎక్స్ను తీసుకోకుండానే కొత్త స్టాకును రష్యన్ సంస్థ సరఫరా చేసిందని ఓఎఫ్కే ఉద్యోగి ఒకరు తెలిపారు. ఇలా పలు రకాల పేలుడు సామగ్రి మొత్తం ఆ నగరంలో భూమి కింద ఉంది. అత్యంత రద్దీగా ఉండే ఈ నగరం ఎప్పుడు ఏమవుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.