ఉర్దూ గురుకులాలకు మంగళం
5 పాఠశాలలు, 2 కాలేజీల్లో అడ్మిషన్ల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ ఉర్దూ మాధ్యమం గురుకులాలకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్ధల సోసైటీ (టెమ్రీస్) మంగళం పాడింది. ఈ విద్యా సంవత్సరానికి వీటిల్లో ఉర్దూ మీడియం ప్రవేశాలను నిలిపివేసింది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రవేశాలు కల్పించింది. దీంతో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న 5 ఉర్దూ గురుకుల పాఠశాలలు... రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న రెండు అప్గ్రేడ్ ఉర్దూ గురుకుల కళాశాలు ఇంగ్లిష్ మీడియంగా మారిపోయాయి.
ఉర్దూలో నాణ్యమైన విద్య కోసం...
ఉర్దూలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో 5 ఉర్దూ మీడియం గురుకులాలను ప్రారంభించింది. నిర్వహణ బాధ్యతలను ఏపీ గురుకుల విద్యాసంస్ధల సోసైటీకి అప్పగించింది. హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో బాలురకు, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లో బాలికలకు ఉర్దూ గురుకులాలను ఏర్పాటు చేసింది. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించింది. కాగా, 1997లో ప్రభుత్వం హైదరాబాద్, నిజామాబాద్ల్లోని రెండు గురుకుల పాఠశాలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది.
తెలంగాణలోని దక్షిణ ప్రాంతంలో గల ఐదు జిల్లాల విద్యార్థులకు హైదరాబాద్ కులీ కుతుబ్షా ఉర్దూ గురుకుల జూనియర్ కాలేజీ (బాయ్స్)లో, ఉత్తర ప్రాంతానికి చెందిన ఐదు జిల్లాల విద్యార్ధులకు నిజామాబాద్ ఉర్దూ గురుకుల కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తూ వస్తున్నారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మరో ఏడు మైనారిటీ ఇంగ్లిష్ మీడియం గురుకులాలను ప్రారంభించారు. దీంతో మైనారిటీ గురుకులాల సంఖ్య 14కు పెరిగింది.
టెమ్రీస్లో విలీనం...
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల కోసం పెద్దఎత్తున గురుకులాలు ప్రారంభించడంతో అన్నింటినీ ఒకే గోడుకు కిందకి తేచ్చేందుకు... తెలంగాణ గురుకుల విద్యా సంస్ధలకు సంబంధించిన 12 మైనారిటీ గురుకులాలు, రెండు అప్గ్రేడ్ మైనారిటీ జూనియర్ కాలేజీలను టెమ్రీస్కి బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చిలో ఉత్తర్వులిచ్చింది. కాగా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ 2017–18 సంవత్సరానికి ఉర్దూ మీడియం అడ్మిషన్లను నిలిపివేయాలని టెమ్రీస్ కార్యదర్శి షపీయుల్లా మౌఖిక ఆదేశాలిచ్చారు. దీనిపై తెలంగాణ ఉర్దూ టీచర్స్ అసొసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ దీనిపై వెంటనే నివేదిక సమర్పించాలని టెమ్రీస్కు మెమోలు ఇచ్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మైనర్ లాంగ్వేజీ మీడియంను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ మసూద్ అహ్మద్ ఆరోపించారు.