విశాల్ సిక్కా జీతం తగ్గిందా?
ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కాకు జీతం చాలా ఎక్కువగా ఇస్తున్నారని చాలామంది అంటుంటారు. కానీ, 2016-17 సంవత్సరానికి ఆయనకు అందిన వేరియబుల్ పే ఎంతో తెలుసా.. కేవలం 46 శాతం మాత్రమే. సాధారణంగా ఉద్యోగుల వేతనంలో కొంత భాగాన్ని వేరియబుల్ పే అని పక్కన పెడతారు. ఆ సంవత్సరంలో వారి పనితీరు ఆధారంగా అందులో ఎంత శాతం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఇన్ఫోసిస్లో అయితే ఫస్ట్ గ్రేడ్ వచ్చినవారికి నూరుశాతం వేరియబుల్ పే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఈఓ విశాల్ సిక్కాకే 46% వేరియబుల్ పే మాత్రమే ఇచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2016-17 సంవత్సరంలో మొత్తం 51 కోట్ల వేరియబుల పే రావాల్సి ఉండగా, అందులో ఆయనకు కేవలం 24 కోట్లు మాత్రమే వచ్చింది. అదికాక ఆయన స్థిరవేతనం మరో రూ. 19 కోట్లు. దాంతో ఈ ఏడాది మొత్తం సుమారు 43 కోట్ల రూపాయలు సంపాదించినట్లయింది. 2015-16లో వచ్చిన 48 కోట్ల కంటే ఇది 5 కోట్ల రూపాయలు తక్కువ.
విశాల్ సిక్కాకు వేతనం పెరిగిందని చాలామంది భావించినా, వాస్తవానికి అది వేరియబుల్ పేలో పెంపు మాత్రమేనని కంపెనీ బోర్డుతో పాటు స్వయంగా సిక్కా కూడా చాలాసార్లు చెప్పారు. లక్ష్యాలను పూర్తిగా సాధిస్తేనే పూర్తి మొత్తం చెల్లిస్తారు. అయితే ఆ లక్ష్యాలేంటనే విషయాన్ని మాత్రం కంపెనీ బహిరంగపరచలేదు. శుక్రవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో ఆదాయ వృద్ధి కేవలం 3.4 శాతం ఉండటంతో పాటు లాభాల్లో వృద్ధి అసలు లేకపోవడం లాంటివి కూడా సిక్కా వేతనం మీద ప్రభావం కనబర్చి ఉంటాయని భావిస్తున్నారు.