Vikrama
-
స్వర్గలోకానికి స్వాగతం
‘‘విక్రమార్కా... మన ఇంద్ర తెలుసుకదా నీకు?’’ అడిగాడు భుజం మీది భేతాళుడు.‘‘నాకు తెలియకపోవడం ఏమిటి! దాయి దాయి దామ్మ నా ఫేవరెట్ సాంగ్’’ వీణ డ్యాన్స్ చేస్తూ చెప్పాడు విక్రమార్కుడు.‘‘నేను చెప్పేది ఇంద్ర సినిమా గురించి కాదు... ఇంద్రుడి గురించి, స్వర్గలోకాధిపతి దేవేంద్రుడి గురించి. ఆయన ఈమధ్య తరచుగా నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నాడట. ఎందుకో చెప్పకపోతే... నీ తల హాంఫట్’’ అని హెచ్చరించాడు భేతాళుడు.విక్రమార్కుడు చెప్పడం మొదలుపెట్టాడు....∙∙ అనగనగా ముగ్గురు వ్యక్తులు. చీమకు కాదు దోమకు కూడా హాని తలపెట్టని మహానుభావులు. ఒకరోజు ఏదో పనిమీద ఈ ముగ్గురూ కారులో ప్రయాణిస్తున్నారు. వెళుతూ వెళుతూ ఒక వర్షం కురిసిన రాత్రి ఈ కారు వెళ్లి ఒక చెట్టును ఢీకొట్టింది. అంతే, ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. సరాసరి స్వర్గానికి వెళ్లిపోయారు. అక్కడ కొండవీటి చాంతాడంతా క్యూ ఉంది.‘‘పాపం పెరిగింది... పాపం పెరిగింది అంటాంగానీ అంతా ఉత్తదే. ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. సినిమా టికెట్ కౌంటర్ల దగ్గర కూడా ఇంత క్యూ ఉండదు’’ అన్నాడు ముగ్గురిలో ఒకరు.‘‘నిజమే సుమా!’’ అన్నారు ఇద్దరు స్నేహితులు.స్వర్గద్వారాలు అప్పుడే తెరిచారు.ఇక అంతే...‘నేను ముందు అంటే కాదు నేను ముందు’ అంటూ జనాలు తోసుకోవడం స్టార్ట్ అయింది.ఒకరి మీద ఒకరు పడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు. పెద్దగా అరుపులు కేకలు.ఈలోపు ఎవరిదో పర్స్ కొట్టేశారు. ఒకరి సెల్‌ఫోన్ దొంగిలించారు.‘‘అయ్యో నా పర్సు...’’‘‘అయ్యో నా సెల్‌ఫోన్’’‘‘షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి నా ఉంగరం కొట్టేశాడు’’ఈ శబ్దాలను మించిన శబ్దంతో...‘‘దయచేసి ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి. సైలెన్స్‌గా ఉండండి. నాపేరు పరోపకారి పాపన్న. ఇంద్రుడిగారి పర్సనల్ సెక్రెటరీని’’ అని అరిచాడు బంగారు కిరీటం పెట్టుకున్న పొడవాటి వ్యక్తి.‘‘ఇంద్రుడి సెక్రటరీ వచ్చాడు’’ అనేమాట చెవిన పడగానే అందరూ సైలెంటైపోయారు.పీయే మళ్లీ మాట్లాడం మొదలు పెట్టాడు...‘‘డీయర్ ఫ్రెండ్స్. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. సపోజ్ మీరు కాకినాడకు వెళ్లాలనుకొని సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లి తెలుగు టీవీ సీరియలంత క్యూలో నిల్చొని నానా ఆపసోపాలు పడి టికెట్టు కొంటారు. తీరా ట్రైన్ ఫ్లాట్‌ఫాం మీదికి వచ్చాక రెట్టింపు ప్రయాణికులు. కొందరు కిటికీలో నుంచి కూడా ట్రైన్లో దూరడానికి ప్రయాత్నిస్తుంటారు. ఓరి నాయనో ఈ ట్రైన్లో వెళితే కాకినాడకు వెళ్లం... సరాసరి నరాకానికి వెళతాం. బతికుంటే దీని తరువాతి ట్రైన్ బఠానీలు అమ్ముకోవచ్చు అనుకుంటూ అక్కడి నుంచి జారుకుంటారు. సేమ్ టు సేమ్ అండీ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీ అందరి దగ్గర స్వర్గానికి రావడానికి అవసరమైన టికెట్లు ఉన్నాయి. సీట్లేమో చా....లా తక్కువగా ఉన్నాయి.’’ అని నసిగాడు పీయే.‘‘ఇప్పుడేమంటావు? నరకానికి వెళ్లమంటావా ఏమిటి?’’ ఒకాయన వీరావేశంగా దూసుక్చొడు. ‘‘ఎందుకయ్యా అంత కోపం. ఇక్కడ సీట్లు లేవంటే నరకానికి వెళ్లమని కాదు కదా అర్థం’’ అన్నాడు పీయే.‘‘అంటే మళ్లీ వెనక్కి... అదే భూలోకానికి వెళ్లమంటావా ఏమిటి? అలా వెళితే ఇంకేమైనా ఉందా! దెయ్యం, దెయ్యం అంటూ అందరూ పారిపోతారు’’ అన్నాడు ఇంకో ఆయన ఆవేదనగా.ఇంతమందికి స్వర్గంలో ప్రవేశం ఎలా కల్పించాలని ఒకవైపు పరోపకారి పాపన్న తల మీద జుట్టు పీక్కొనుచుండగా మరోవైపు ఏం జరుగుతుందో చూడండి...ఒక దగ్గర:‘జస్ట్ రెండు కోట్లు... రెండే కోట్లు’ అని అందరి చెవిలో రహస్యంగా చెబుతూ పోతున్నాడు ఒకడు. అతని చేతిలో నలుపు రంగులో టికెట్లు ఉన్నాయి.‘‘ఏమిటిది?’’ అని ఆరాతీశాడు ఒక పెద్దాయన.‘‘కనిపించడం లేదా? బ్లాక్టికెట్స్’’ అన్నాడు ఆ వ్యక్తి మెల్లగా.‘‘బ్లాక్టికెట్లా? ఇక్కడ సినిమా హాలు ఎక్కడ ఉంది?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆ బోసినోరు పెద్దాయన.‘‘స్వర్గం ఉంది. ఆ స్వర్గంలోకి వెళ్లామంటే ఒక్కటనేమిటీ వందలాది సినిమా హాళ్లు కనిపిస్తాయి. రంభ, ఊర్వశీ, మేనకల లైవ్డ్యాన్స్ పోగ్రాం చూడొచ్చు. ఇంకా....’’ అంటూ చెప్పుకుపోతున్నాడు ఆ గళ్ల చొక్కా వ్యక్తి.ఈలోపు హెవెన్ పోలీస్ స్క్వాడ్ వాళ్లు అక్కడికొచ్చి గళ్ల చొక్కా వ్యక్తిని నాలుగు బాది సెల్లో వేశారు.‘‘ష్...ష్....’’ అంటూ సుబ్బారావు అప్పారావును రహస్యంగా గిచ్చాడు.‘‘ఏమిటి?’’ అన్నాడు గిచ్చబడిన అప్పారావు.సుబ్బారావు: కోచింగ్ సెంటర్‌కు నాతో పాటు వస్తావా!అప్పారావు: కోచింగ్ సెంటరేమిటి?! మనమేమన్నా ఎమ్సెట్ ఎగ్జామ్స్ రాస్తున్నామా! సుబ్బారావు: ఎమ్సెట్ కాదు హెవెన్సెట్ అప్పారావు: హెవెన్సెటా? అదేమిటి? సుబ్బారావు: స్వర్గంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ హెవెన్సెట్ ప్లాన్ చేశారు. ఇందులో మంచి ర్యాంకులు తెచ్చుకున్నవాళ్లకే స్వర్గంలో ప్రవేశం ఉంటుందట. మనకు సీటు దొరకాలంటే స్టార్ కోచింగ్ సెంటర్లో చేరడం మంచిది. ఈ కోచింగ్ సెంటర్లో చేరిన వారికి గతంలో మంచి మంచి మార్కులు వచ్చాయట’’మరో దగ్గర:‘‘ఒరేయ్ గుర్నాథం... నీకో బ్రేకింగ్ న్యూస్!’’‘‘బ్రేకింగ్ న్యూస్‌ల గొడవ ఇక్కడ కూడా తప్పడం లేదా! ఏమిటో చెప్పు’’‘‘హెవెన్సెట్ పేపర్ లీకైందట!’’‘‘పేపర్ లీకైందా? ఇప్పుడెలా?’’‘‘గ్యాస్ లీకైనట్లు ముఖం పెడతావేమిటి? ఆ లీక్ చేసిన వాడు మా ఫ్రెండ్ బామ్మర్దికి స్వయాన బావ. నువ్వు ఓకే అంటే నేను బేరం మాట్లాడతాను’’‘‘డబ్బులదేముంది. పాపిష్ఠి డబ్బు. మనకు స్వర్గం ముఖ్యం’’∙∙ నిద్రలోకం నుంచి ఉలిక్కిపడి లేచాడు ఇంద్రుడు.‘‘ఏమిటి అలా లేచారు?’’ అడిగింది ఆయన భార్య కంగారుగా.‘‘ఏమిలేదు దేవీ. రాత్రి ఒక పీడడ్రీమ్ వచ్చినది. ఆ డ్రీమ్‌లో స్వర్గంలోకి ప్రవేశించడానికి కొందరు మానవులు రకరకాల వక్రమార్గాలు అనుసరిస్తున్నరట. నాకేందుకో భయముగా యున్నది’’ అన్నాడు ఇంద్రుడు.‘‘ఈ మానవులు ఎంతకైనను తెగించువారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి’’ అని ఇంద్రుడికి జాగ్రత్తలు చెప్పింది శచీదేవి. – యాకుబ్ పాషా -
‘విక్రమార్కుడు' ని తలపించేలా పవర్
‘‘ ‘విక్రమార్కుడు" సినిమాలోని పోలీస్ పాత్రను తలపించేలా ‘పవర్'లో రవితేజ పాత్ర ఉంటుంది’’ అని నిర్మాత ‘రాక్‌లైన్' వెంకటేశ్ అన్నారు. రవితేజ కథానాయకునిగా కేఎస్ రవీంద్ర(బాబీ)ను దర్శకునిగా పరిచయం చేస్తూ ‘రాక్‌లైన్' వెంకటేశ్ నిర్మించిన ‘పవర్' ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పత్రికల వారితో దర్శక, నిర్మాతలు మాట్లాడారు. తొలుత ‘రాక్‌లైన్' వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘కన్నడంలో 40 చిత్రాలు నిర్మించాను. తెలుగు సినిమా తీయాలనేది నా ఆకాంక్ష. బెంగళూరులో రవితేజ సినిమా విడుదలైతే, అందరు హీరోల అభిమానులూ ఆ థియేటర్ దగ్గరే ఉంటారు. అందుకే రవితేజతోనే సినిమా తీయాలనుకున్నాను. ఆ విషయం రవితేజకు చాలా సార్లు చెప్పాను. సరైన కథ దొరికినప్పుడు చేద్దామని ఆయన చెబుతూ వచ్చారు. ఇన్నాళ్లకు మా కాంబినేషన్లో సినిమా కుదిరింది. టైటిల్‌కి తగ్గట్టుగా జనరంజకంగా బాబీ ఈ చిత్రాన్ని మలిచాడు’’ అని చెప్పారు. రజనీకాంత్‌తో తాను నిర్మిస్తున్న ‘లింగా' సినిమా గురించి ఆయన చెబుతూ -‘‘రజనీసార్‌తో చేయడం నా అదృష్టం. సినిమా పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఫారిన్లో పాటల చిత్రీకరించే పనిలో ఉన్నాం’’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ -‘‘దర్శకుడు కావాలనేది నా కల. ఆ లక్ష్యంతోనే రచయితగా కెరీర్ ప్రారంభించాను. స్టార్‌రైటర్ చిన్నికృష్ణగారి దగ్గర సహాయకునిగా చేరాను. తర్వాత ‘దిల్' రాజు సంస్థలో, రచయిత కోన వెంకట్ల దగ్గర పనిచేశాను. ఆ అనుభవంతోనే ‘బలుపు', ‘అల్లుడు శీను’ చిత్రాలకు కథలందించాను. ఇక ‘పవర్'విషయానికొస్తే... మూడేళ్ల క్రితమే తయారు చేసుకున్న కథ ఇది. ‘బలుపు'చిత్రీకరణ సమయంలో రవితేజకు ఈ కథ చెప్పాను. పోలీస్ కథల్లో కొత్తగా ఉందన్నారు. ‘రాక్‌లైన్'వెంకటేశ్‌గారికి నా పేరు సూచించింది కూడా రవితేజే. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ‘ఓకే అయ్యింది’’ అని చెప్పారు. ‘పవర్'గురించి మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టుగా శక్తిమంతంగా ఇందులో రవితేజ పాత్ర ఉంటుంది. గతంలో వచ్చిన పోలీసు కథలకు ఇది భిన్నమైన కథ. రవితేజ ఆహార్యం, సంభాషణలు పలికే తీరు కొత్తగా ఉంటాయి. రవితేజ సినిమాల్లో అత్యధిక లొకేషన్లలో చిత్రీకరించిన సినిమా కూడా ఇదే. తమన్ సంగీతం, రవితేజ పాడిన పాట సినిమాకు హైలైట్స్. రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడతాయి’’ అని తెలిపారు బాబీ.