‘విక్రమార్కుడు' ని తలపించేలా పవర్
‘‘ ‘విక్రమార్కుడు" సినిమాలోని పోలీస్ పాత్రను తలపించేలా ‘పవర్'లో రవితేజ పాత్ర ఉంటుంది’’ అని నిర్మాత ‘రాక్‌లైన్' వెంకటేశ్ అన్నారు. రవితేజ కథానాయకునిగా కేఎస్ రవీంద్ర(బాబీ)ను దర్శకునిగా పరిచయం చేస్తూ ‘రాక్‌లైన్' వెంకటేశ్ నిర్మించిన ‘పవర్' ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పత్రికల వారితో దర్శక, నిర్మాతలు మాట్లాడారు. తొలుత ‘రాక్‌లైన్' వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘కన్నడంలో 40 చిత్రాలు నిర్మించాను. తెలుగు సినిమా తీయాలనేది నా ఆకాంక్ష. బెంగళూరులో రవితేజ సినిమా విడుదలైతే, అందరు హీరోల అభిమానులూ ఆ థియేటర్ దగ్గరే ఉంటారు. అందుకే రవితేజతోనే సినిమా తీయాలనుకున్నాను. ఆ విషయం రవితేజకు చాలా సార్లు చెప్పాను. సరైన కథ దొరికినప్పుడు చేద్దామని ఆయన చెబుతూ వచ్చారు. ఇన్నాళ్లకు మా కాంబినేషన్‌లో సినిమా కుదిరింది. టైటిల్‌కి తగ్గట్టుగా జనరంజకంగా బాబీ ఈ చిత్రాన్ని మలిచాడు’’ అని చెప్పారు. రజనీకాంత్‌తో తాను నిర్మిస్తున్న ‘లింగా' సినిమా గురించి ఆయన చెబుతూ -‘‘రజనీసార్‌తో చేయడం నా అదృష్టం. సినిమా పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఫారిన్‌లో పాటల చిత్రీకరించే పనిలో ఉన్నాం’’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ -‘‘దర్శకుడు కావాలనేది నా కల. ఆ లక్ష్యంతోనే రచయితగా కెరీర్ ప్రారంభించాను. స్టార్‌రైటర్ చిన్నికృష్ణగారి దగ్గర సహాయకునిగా చేరాను. తర్వాత ‘దిల్' రాజు సంస్థలో, రచయిత కోన వెంకట్‌ల దగ్గర పనిచేశాను. ఆ అనుభవంతోనే ‘బలుపు', ‘అల్లుడు శీను’ చిత్రాలకు కథలందించాను. ఇక ‘పవర్'విషయానికొస్తే... మూడేళ్ల క్రితమే తయారు చేసుకున్న కథ ఇది. ‘బలుపు'చిత్రీకరణ సమయంలో రవితేజకు ఈ కథ చెప్పాను. పోలీస్ కథల్లో కొత్తగా ఉందన్నారు. ‘రాక్‌లైన్'వెంకటేశ్‌గారికి నా పేరు సూచించింది కూడా రవితేజే. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ‘ఓకే అయ్యింది’’ అని చెప్పారు. ‘పవర్'గురించి మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టుగా శక్తిమంతంగా ఇందులో రవితేజ పాత్ర ఉంటుంది. గతంలో వచ్చిన పోలీసు కథలకు ఇది భిన్నమైన కథ. రవితేజ ఆహార్యం, సంభాషణలు పలికే తీరు కొత్తగా ఉంటాయి. రవితేజ సినిమాల్లో అత్యధిక లొకేషన్లలో చిత్రీకరించిన సినిమా కూడా ఇదే. తమన్ సంగీతం, రవితేజ పాడిన పాట సినిమాకు హైలైట్స్. రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడతాయి’’ అని తెలిపారు బాబీ.