వినాయక పూజతో సకల శుభాలు
చినజీయర్ స్వామి ఉపదేశం
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): ముక్కోటి దేవతల్లో తొలి పూజ అందుకునే వినాయకుడిని ప్రార్థించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఉపదేశించారు. తాడేపల్లి వైఎస్సార్ సెంటర్లో గణేశ్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద గణేశునికి మంగళవారం చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత తాడేపల్లి కొత్తూరు శివాలయం వద్ద చినజీయర్ స్వామికి ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా వైఎస్సార్ సెంటర్ నుంచి గణేశ్ మండపానికి స్వామిజీని తీసుకువచ్చారు. పూజల అనంతరం భక్తులనుద్దేశించి స్వామీజీ మాట్లాడారు. గణేశ్ మండపాల వద్ద ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అహోబిళ రామానుజ జీయర్ స్వామి, విగ్రహ దాతలు వినాయక లైఫ్ సైన్సెస్ అధినేతలు కళ్లం చంద్రశేఖర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, కమిటీ సభ్యులు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, దొంతిరెడ్డి గాంధీ, రుక్మాందరెడ్డి, కౌన్సిలర్లు ఈదులమూడి డేవిడ్రాజు, మాచర్ల అబ్బు, ఎండి గోరేబాబు, ఓలేటి రాము, దర్శి విజయశ్రీ, కాటాబత్తుల నిర్మల తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు చినజీయర్ మంగళ శాసనాలు అందజేశారు.