గతవారం బిజినెస్
విస్తరణ దిశగా వాల్‌మార్ట్ ఇండియా
అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ సంస్థ అనుబంధ కంపెనీ వాల్‌మార్ట్ ఇండియా మార్కెట్ విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 4-5 ఏళ్లలో భారత్‌లో కొత్తగా 50కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 20 స్టోర్లు ఉన్నాయి.
16% కుప్పకూలిన గ్రీస్ స్టాక్ మార్కెట్
గ్రీస్ స్టాక్ మార్కెట్ గత సోమవారం భారీగా పతనమైంది. ఐదు వారాల తర్వాత ఆరంభమైన ఏథెన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ప్రధాన సూచీ ఒక దశలో 22 శాతం వరకూ క్షీణించింది. చివరకు 16 శాతం నష్టంతో ముగిసింది. 1985 తర్వాత ఇదే అత్యంత అధ్వానమైన ఒక రోజు నష్టం. బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థల షేర్లు దాదాపు 30 శాతం వరకూ నష్టపోయాయి.
50 కోట్ల డాలర్ల సమీకరణలో స్నాప్‌డీల్
స్నాప్‌డీల్ తాజాగా ఆలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్ తదితర సంస్థల నుంచి 50 కోట్ల డాలర్లు (రూ. 3,000 కోట్లకుపైగా) సమీకరించనుంది. ఇందుకోసం వాటితో చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది వారాల్లో ఫండింగ్ వివరాలు వెల్లడి కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నెలలో 4 కంపెనీలు ఐపీఓకు
ఈ నెలలో నాలుగు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. దిలిప్ బిల్డ్‌కాన్(రూ.650 కోట్లు), నవ్కార్ కార్పొ(రూ.510 కోట్లు), పవర్ మెక్ ప్రాజెక్ట్స్(రూ.270 కోట్లు), ప్రభాత్ డెయిరీ (రూ.300 కోట్లు)..ఈ నాలుగు కంపెనీలు కలసి దాదాపు రూ.1,820 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. ఈ నెల 7న ప్రారంభమైన పవర్ మెక్ ఐపీఓ 11న ముగుస్తుంది. మిగిలిన మూడు కంపెనీల ఐపీఓలు ఆ తర్వాత మొదలవుతాయి.
మళ్లీ దేశీ మార్కెట్లోకి థామ్సన్ బ్రాండ్
సుమారు పదేళ్ల విరామం అనంతరం థామ్సన్ బ్రాండ్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం థామ్సన్ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే విధంగా రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
మరో కంపెనీగా బీఎస్ఎన్ఎల్ టవర్ల విభాగం
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ టవర్ల వ్యాపార విభాగాన్ని విడగొట్టి, ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేం ద్ర కేబినెట్ బుధవారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
త్వరలో ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్యకలాపాలు
కొత్తగా బ్యాంకింగ్ లెసైన్సు పొందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆర్బీఐ నుంచి నిర్వహణ పరమైన లెసైన్సులు కూడా వచ్చాక డీమెర్జర్ స్కీమ్ అమలవుతుందని బీఎస్ఈకి ఐడీఎఫ్సీ తెలిపింది. జూలై 23న ఐడీఎఫ్సీ బ్యాంకుకు ఆర్బీఐ లెసైన్సు మంజూరు చేసింది. 20 శాఖలు, రూ. 55,000 కోట్ల రుణ ఖాతాలతో కార్యకలాపాలు ప్రారంభించాలని ఐడీఎఫ్సీ బ్యాంకు యోచిస్తోంది.
ఆస్ట్రేలియాలో అదానీ ప్రాజెక్ట్‌కు ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియాలో తలపెట్టిన బొగ్గు గనుల ప్రాజెక్టు విషయంలో అదానీ గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతులను ఆస్ట్రేలియా కోర్టు పక్కన పెట్టింది. దాదాపు 16.5 బిలియన్ డాలర్ల ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు, స్థానికులు కేసు దాఖలు చేయడంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
స్టాక్ మార్కెట్లో పీఎఫ్ పెట్టుబడులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ. 5,000 కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి దీన్ని 15 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కి చెందిన రెండు ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్‌ల ద్వారా ఈ పెట్టుబడులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్
స్టాక్ మార్కెట్ల పతనాన్ని నిలువరించే దిశగా షేర్ల ధరలకు ఊతమిచ్చేందుకు చైనా ప్రభుత్వం గత రెండు నెలల్లో ఏకంగా 900 బిలియన్ యువాన్లు (147 బిలియన్ డాలర్లు, దాదాపు రూ. 9 లక్షల కోట్లు) వెచ్చించింది. మార్కెట్లకు సహాయక ప్యాకేజీ కింద.. స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ చైనా సెక్యూరిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (సీఎస్ఎఫ్) తదితర సంస్థలకు నిధులు అందించింది.
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 4జీ సేవలు
దేశంలో తొలి 4జీ సేవలను ప్రారంభించిన టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆ సేవలను మరిన్ని పట్టణాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా దాదాపు 296 పట్టణాల్లో 4జీ సేవలను ఆవిష్కరించినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. అలాగే 4జీ సేవల ఆవిష్కరణతో పాటు ‘వింక్ మూవీస్’ అనే మొబైల్ యాప్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 4జీ హ్యాండ్సెట్ల తయారీ, విక్రయాల కోసం శామ్సంగ్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలతో జతకడుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.14,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
డీల్స్..
- భారతీ ఎయిర్టెల్ సంస్థ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించే వైటీఎస్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది.
- అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్, ప్రపంచ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో కలసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది.
- టాటా సన్స్ తన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో పునర్వ్యస్థీ కరణలో భాగంగా టైటాన్ కంపెనీలో 2.18 శాతం వాటాను దాదాపు రూ.680 కోట్లకు టాటా స్టీల్ నుంచి కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలుతో టైటాన్లో టాటా సన్స్ వాటా 17.40 శాతం నుంచి 19.59 శాతానికి పెరుగుతుంది.
- అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ సంస్థ అమ్జెన్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది.