వారి నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
గోదావరిలో స్నానం చేస్తూ మహిళ, బాలిక మృతి
బంధువుల ఇంట విషాదం
గోదావరిలో స్నానం.. వారిపాలిట మృత్యువైంది. ఇతర జిల్లాల నుంచి ఎవరు రాజమహేంద్రవరం వచ్చినా.. ఒక్కసారి గోదావరిలో స్నానం చేయకుండా వెళ్లరు. ఇలా బంధువుల ఇంటి శుభకార్యానికి వచ్చి.. బొబ్బర్లంక కాటన్ బ్యారెజ్ వద్ద స్నానం చేస్తూ ఇద్దరు మృత్యువాతపడ్డారు. - ఆత్రేయపురం (కొత్తపేట)
గోదావరిలో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి బుధవారం ఇద్దరు మృత్యవాత పడ్డారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లకం వద్ద కాటన్ బ్యారెజీ వద్ద జరిగిన ఈ సంఘటనలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టాభిపురానికి చెందిన తిరుపతి నాగమణి (40), తిరుపతి మానస (12) మృత్యవాతపడ్డారు. హెడ్ వర్క్సు అధికారులు ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహనికి నాగమణి అక్కడిక్కడే మృతి చెందింది. కాగా మానసను వారి బందువులు ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మృతులు నాగమణి, మానస రాజమహేంద్రవరం రూరల్ మండలం హకుంపేటలో తమ బందువుల ఇంట జరిగే శుభకార్యానికి ఈ నెల 21న వచ్చారు. ఈ నేపథ్యంలో తమ బందువులు 16 మందితో కలిసి బొబ్బర్లంక కాటన్ బ్యారేజీ వద్దకు గోదావరిలో స్నానం చేసేందుకు వచ్చారు. ముందుగా నాగమణి మానస స్నానం చేస్తుండగా బ్యారేజీ వద్ద 69, 70 గేట్లను హెడ్‌వర్క్సు అధికారులు ఒక్కసారిగా ఎత్తివేయడంతో వీరు నీట మునిగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం
బ్యారేజీకి దిగువ భాగంలో సుమారు 10 అడుగుల లోతు నీరు ఉండటంతో అనేక మంది స్నానం చేస్తుంటారు. అయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో అనేక మంది మృత్యవాత పడుతున్నారు. 2001-2002 ఎటుంటి జాగ్రత్తులు తీసుకోకుండా, ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తివేయడంతో గోదావరిలో స్నానానికి వెళ్లిన 33 మంది మృతి చెందారు. అయినా అ«ధికారులు నిర్లక్ష్యం వీడలేదు. ఇటీవల ఇటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇద్దరు మృత్యువాత పడ్డారంటే అధికారుల నిర్లక్ష్యమే కారణమని బందువులు ఆరోపిస్తున్నారు.
బ్యారేజీపై నుంచి చూస్తే కనిపిస్తారు
బ్యారేజీపై నుంచి చూస్తే సమీపంలో స్నానం చేసేవారు కనిపిస్తారు. ఎవరైనా విహర యాత్రకు వచ్చి గోదావరిలో స్నానం చేస్తున్నారా అజాగ్రత్తగా ఉన్నారా అనే విషయాన్ని కానీ హెడ్‌వర్క్సు అధికారులు పట్టించుకోకుండా గేట్లు ఎత్తివేయడాన్ని స్థానికులు, మృతుల బందువులు తప్పు పడుతున్నారు. గేట్లు ఎత్తివేసిన వెంటనే గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు మృత్యవాత పడారు. గేట్లు ఎత్తి వేయాల్సి వస్తే హెచ్చరికగా సైరన్ మోగించడం, లేదా టాంటాం వేయించడం చేయాలి. సమీపంలో ఎవరూ లేరని తెలుసుకుని లేదా రాత్రి గాని గేట్లు ఎత్తి వేయాలి. ఇవేమి పాటించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.