ప్రతిష్టాత్మకంగా జన్మభూమి
జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దీని నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని మండలకేంద్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక అధికారుల సమీక్షించారు.
విశాఖ రూరల్ : జన్మభూమి కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రారంభించడానికి జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో గురువారం ఉదయం 6.30కు ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు భారీ ర్యాలీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధికారులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. శుక్రవారం దసరా సెలవు కావడంతో మళ్లీ గ్రామాల్లో 4వ తేదీ నుంచి జన్మభూమిని చేపడతారు.
ఇందుకోసంప్రతీ మండలానికి రెండు బందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బందం రోజుకు ఒక పంచాయతీలో గ్రామ సభ నిర్వహిస్తుంది. స్థానిక సమస్యలతో పాటు పొలంబడి, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ఇటీవల రద్దు చేసిన పెన్షన్లపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిశీలిస్తారు. రేషన్‌కార్డు, పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే అన్ని గ్రామాల్లో ఈ బందాలు పర్యటించే పరిస్థితి కనిపించడం లేదు.
ఒక ప్రాంతంలో సమావేశం నిర్వహించి ప్రజలను అక్కడికి తరలించాలని ప్రజాప్రతినిధులు ఆలోచన చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళితే హామీలపై ప్రజలు నిలదీస్తారన్న భయం సర్వత్రా నెలకొంది. దీంతో అన్ని గ్రామాల్లో సమావేశాలు జరిగే అవకాశం లేదు.