బాలికలకు భరోసా
● ధైర్యం నింపేలా.. ఆత్మస్థైర్యం పెంపొందించేలా ● సర్కారు బడుల్లో బాలికా సాధికారత క్లబ్‌లు ● జిల్లాలో 143 పాఠశాలల్లో జీసీఈసీల ఏర్పాటు ● కౌమార దశలో సమస్యలు అధిగమించేందుకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినిల్లో ధైర్యం నింపేలా ఆత్మస్థైర్యం పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కౌమార దశలో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను అధిగమించే దిశగా ముందుకు సాగుతుంది. ఇటీవల పలు పాఠశాలల్లో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై వెకిలి చేష్టలకు పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో పోకిరీలు, బడుల్లో కొంత మంది విద్యార్థులు వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులకు చెప్పుకోలేక బాలికలు మానసికంగా సతమతం అవుతున్నారు. కొంతమంది తమలో తామే మనోవేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొంత మంది ఎవరికి చెప్పుకోలేక దుఃఖాన్ని దిగమింగుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం గర్‌ల్స్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్ (జీసీఈసీ)లను ఏర్పాటు చేస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు తదితర ఉన్నత పాఠశాలల్లో వీటి ఏర్పాటుకు చర్యలు చేపడుతుంది.
కౌమార సమస్యలు ఎదుర్కొనేందుకు..
ఉన్నత పాఠశాలల్లో చదివే బాలికలు కౌమార దశలో మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వారి నడవడిక, ప్రవర్తనలో మార్పులు కలు గుతాయి. విద్యార్థినులు చెడు అలవాట్లకు గురికాకుండా, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు బాలికా సాధికారత క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పాలి.. ఎలా అధిగమించాలి.. ఏయే ఇబ్బందులకు గురవుతున్నారు.. వాటికి పరిష్కారం కోసం ఈ క్లబ్‌లు దోహద పడతాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. విద్యార్థి దశలో కౌమార దశ అనేది ఎంతో కీలకం. అయితే విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు, వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలికల చట్టాలను తెలియజేసేందుకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
కమిటీల ఏర్పాటు..
బాలిక సాధికారత కమిటీలను ఏర్పాటు చేసేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. నవంబర్ 1న విద్యార్థినిలకు ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. 4న జీసీఈసీ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చైర్మన్‌గా, ఫ్రెండ్లీ టీచర్, ప్రతీ తరగతికి ఒక బాలిక సభ్యులుగా ఉంటారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను తెలియజేసేందుకు ఫిర్యాదుల పెట్టెను బడిలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే రిజిస్టర్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను అందులో నమోదు చేయనున్నారు. అలాగే నోటీసు బోర్డుపై టోల్‌ఫ్రీ నం.1098 ను ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్‌లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన, జనవరిలో న్యాయ సదస్సులు, ఫిబ్రవరిలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. విద్యార్థులకు సదస్సులు ఏర్పాటు చేసి బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌ను తెలియజేస్తారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చర్యలు తీసుకునేలా కమిటీలు కృషి చేస్తాయి.
ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కరాటే శిక్షణ..
బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాణిలక్ష్మిబాయి ఆత్మరక్షణ పరియోజన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతితీ ఉన్నత పాఠశాలలో కరాటే శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 163 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇటీవల శిక్షకులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, 54 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగనుంది. శిక్షకుడికి నెలకు రూ.5వేల చొప్పున వేతనం ఇవ్వనున్నారు. ప్రతీ పాఠశాలలో 6 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థినిలకు శిక్షణ కల్పిస్తారు. ఈ కార్యక్రమాలు పీఈటీ, పీడీ, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
సాధికారత క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బాలికా సాధి కారత క్లబ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. నవంబర్ 4న అన్ని పాఠశాలల్లో వీటిని ఏర్పా టు చేసి ఫిర్యాదుల పెట్టె, రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచుతాం. 143 పాఠశాలల్లో జీసీఈసీ క్లబ్‌లను, అలాగే 163 పాఠశాలల్లో కరాటే శిక్షణ నేర్పించేలా చర్యలు చేపడుతున్నాం.
– ఉదయ్‌శ్రీ, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment