పల్లె పోరుకు సమాయత్తం
మావల గ్రామ ముఖచిత్రం
కైలాస్‌నగర్: సంక్రాంతిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆదిశగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు సమగ్ర ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేలా జిల్లా పంచాయతీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను రూపొందించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసే చర్యలు చేపట్టారు. మండలాల నుంచి జిల్లా కేంద్రానికి తెప్పిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వాటిని ఆయా మండలాల్లోని పంచాయతీలకు తిరిగి పంపించనున్నారు.
మూడు విడతల్లో ఎన్నికలు
జిల్లాలోని 17 మండలాల పరిధిలో 473 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలో 3,854 వార్డులున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా పంచాయతీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి విడతలో ఆదిలాబాద్ రూరల్, మావల, బేల, జైనథ్, తాంసి, భీంపూర్ మండలాల్లోని పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. రెండో విడతలో బోథ్, బజార్‌హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు, మూడోవిడతలో ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని గ్రామ పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు జరిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
3,854 పోలింగ్ కేంద్రాలు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం వార్డుకు ఒకటి చొప్పున జిల్లా వ్యాప్తంగా 604 లోకేషన్స్‌లోని 3,854 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. మొదటి విడతలో 188 లోకేషన్స్‌లోని 1,244 పోలింగ్ కేంద్రాలు, రెండో విడతకు 221 లోకేషన్స్‌లోని 1,220 పోలింగ్ కేంద్రాలను, మూడోవిడతలో 195 లోకేషన్స్‌లోని 1,390 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వాటిల్లోని వసతులపై ఆరా తీశారు. ఎన్నికల సమయం నాటికి ఆయా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు, చేపట్టాల్సిన చర్యలు, ర్యాంపుల నిర్మాణాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేలా పంచాయతీల వారీగా నివేదికలను సైతం తెప్పించారు. నిధుల మంజూరు కోసం వాటిని ప్రభుత్వం ద్వారా ఈసీకి పంపించనున్నారు.
బ్యాలెట్ బాక్స్‌ల మరమ్మతులపై దృష్టి
పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 7,200 బ్యాలెట్ బాక్స్‌లున్నాయి. 2019 జనవరిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వినియోగించిన బ్యాలెట్ బాక్స్‌లను ఫలితాల అనంతరం మండలాల్లోని ఎంపీడీవో, తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాల్లో భద్రపరిచారు. ఐదేళ్లు నిల్వ ఉంచడంతో వాటిల్లో ఎన్ని సక్రమంగా ఉన్నాయి, ఎన్నింటికి మరమ్మతులు అవసరమవుతాయనే దిశగా పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. వాటిని జిల్లాలోని వివిధ మండలాల నుంచి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో గల గోడౌన్‌కు తరలిస్తున్నారు. అన్ని మండలాల నుంచి జిల్లాకు చేరుకున్న అనంతరం వాటికి మరమ్మతులు చేపట్టి ఎన్నికల నిర్వహణకు వీలుగా సిద్ధం చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పంచాయతీల వారీగా వాటిని ఆయా గ్రామాలకు తరలిస్తారు.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు
బ్యాలెట్ బాక్స్‌ల మరమ్మతులపై దృష్టి
ఇప్పటికే వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం
జిల్లాలోని గ్రామ పంచాయతీల వివరాలు
గ్రామ పంచాయతీలు : 473
వార్డులు:3,854
ఎన్నికలు జరిగే పంచాయతీలు, వార్డులు
విడతలు పంచాయతీలు వార్డులు
మొదటివిడత 154 1,244
రెండోవిడత 151 1,220
మూడోవిడత 165 1,390
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను పారదర్శకంగా సిద్ధం చేశాం. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ప్రకటించినా ఎన్నికలు జరిగేలా సర్వం సిద్ధం చేస్తున్నాం.
– ఎస్.శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment